బౌలింగ్ వేయలేకపోతే హార్ధిక్ పాండ్యా స్థానంలో అయ్యర్‌కి చోటు... శ్రేయాస్ అయ్యర్ కాదండోయ్...

First Published Oct 1, 2021, 10:20 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీకి భారత జట్టును ప్రకటించినప్పుడు ఎవ్వరూ పెద్దగా విమర్శలు చేయలేదు. ఉన్నంతలో పర్ఫెక్ట్ టీమ్‌ను ఎంపిక చేశారని ప్రశంసలు వచ్చాయి. అయితే టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు ఐపీఎల్ ఫేజ్ 2 మ్యాచులు జరుగుతుండడం, ఈ టోర్నీలో మెగా టోర్నీ కోసం భారత జట్టుకి ఎంపికైన ప్లేయర్లు ఫెయిల్ అవుతున్నారు...

ఐపీఎల్‌లో గత మూడు సీజన్లలో 400+ పరుగులు చేసి, సెలక్టర్లను ఇంప్రెస్ చేసిన సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, ఈ సారి ఒక్క మ్యాచ్‌లో కూడా 50+ స్కోరు అందుకోలేకపోయారు... ఈ ఇద్దరి ఫామ్‌, టీమిండియా ఫ్యాన్స్‌ను తెగ కలవరపెడుతోంది...

ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై రెండేళ్లుగా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆసీస్ టూర్‌లో బ్యాటుతో రాణించినా, బాల్‌తో మ్యాజిక్ చేయలేకపోయాడు హార్ధిక్ పాండ్యా. శ్రీలంక టూర్‌లో బ్యాటుతోనూ ఫెయిల్ అయ్యాడు...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు హార్ధిక్ పాండ్యా. అయితే బౌలింగ్ వేయడానికి మాత్రం ఇంకా సాహసించడం లేదు...

దీంతో కేవలం బ్యాటింగ్ చేయడానికే అయితే టీమిండియాకి హార్ధిక్ పాండ్యాతో పెద్దగా అవసరం ఉండదు. కాబట్టి బౌలింగ్ చేయలేకపోతే హార్ధిక్ పాండ్యాను టీ20 వరల్డ్‌కప్ జట్టు నుంచి తొలగించాలని కోరుతున్నారు టీమిండియా ఫ్యాన్స్...

హార్ధిక్ పాండ్యా స్థానంలో కేకేఆర్ యంగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కి చోటు ఇవ్వాలని కోరుతున్నారు. ఫేజ్ 2 ఆరంభంలో శ్రేయాస్ అయ్యర్ బ్యాటుతో ఆకట్టుకున్నా, వెంకటేశ్ అయ్యర్ మాత్రం అటు బ్యాటుతో, ఇటు బాల్‌తో నిలకడకైన ప్రదర్శన ఇచ్చి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు..

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్, కేకేఆర్ ఆటతీరును మొత్తం మార్చివేశాడు. 5 మ్యాచుల్లో 193 పరుగులు చేసిన అయ్యర్ ఇన్నింగ్స్‌లో 2 హాఫ్ సెంచరీలు, 25 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి...

అంతేనా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హెట్మయర్, అక్షర్ పటేల్ వికెట్లు తీసి అదరగొట్టాడు వెంకటేశ్ అయ్యర్... 135కి.మీ+ వేగంతో అద్భుతంగా బౌలింగ్ చేసి పర్ఫెక్ట్  ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా కనిపించాడు..

‘వెంకటేశ్ అయ్యర్, టీమిండియా వెతుకుతున్న పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్... బౌలింగ్ చేసేటప్పుడు యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెడుతున్నాడు. బ్యాటింగ్‌లో అదే యార్కర్లను బౌండరీలుగా మలుస్తున్నాడు... ఇప్పుడు కాకపోయినా త్వరలోనే అతను టీమిండియాలోకి వస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

హార్ధిక్ పాండ్యా గాయపడిన తర్వాత సరైన పేస్ ఆల్‌రౌండర్ కోసం వెతుకుతున్న టీమిండియాకి వెంకటేశ్ అయ్యర్ పర్ఫెక్ట్‌గా సరిపోతాడని... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అతనికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు అభిమానులు...

click me!