IPL 2021: ఆ ఇద్దరితో ప్రయోగాలు చేస్తున్న ఎమ్మెస్ ధోనీ... టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో మార్పులు తప్పవా...

First Published Oct 7, 2021, 8:40 PM IST

గేమ్‌ను అర్థం చేసుకోవడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దిట్ట. పరిస్థితులకు తగ్గట్టుగా ఫీల్డింగ్‌ను, బౌలర్లను మార్చి సక్సెస్ సాధించడంలో జీనియస్... అయితే మాహీ కెప్టెన్సీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది సీఎస్‌కే...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత వరుసగా మూడు పరాజయాలు అందుకుంది...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ‌లో అయితే ఆన్ ఫీల్డ్ పాదరసంలా ఆలోచించే కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తీసుకున్న నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి...

అప్పటికే భారీగా పరుగులు సమర్పించిన దీపక్ చాహార్‌కి మళ్లీ మళ్లీ బంతి అప్పగించాడు ఎమ్మెస్ ధోనీ. మ్యాచ్ 13 ఓవర్లలో ముగిస్తే, అందులో దీపక్ చాహార్ తన కోటా 4 ఓవర్లను ముగించేశాడు...

ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కి ముందు ఒత్తిడి అధిగమించి, క్లిష్ట సమయంలో మ్యాచ్‌ను టర్న్ చేయగల సామర్థ్యం గల బౌలర్లను గుర్తించేందుకే మాహీ ఈ ప్రయోగం చేస్తున్నాడని క్రికెట్ విశ్లేషకుల అంచనా... 

ఐపీఎల్ 2021 తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియాకి మెంటర్‌గా వ్యవహరించబోతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ... దీంతో మెగా టోర్నీలో రాణించగల ప్లేయర్లను గుర్తించేందుకు ఈ మ్యాచులను వాడుతున్నాడు ఎమ్మెస్...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్. ఇండియాలో జరిగిన ఫస్టాఫ్‌లో దీపక్ చాహార్ పవర్ ప్లేలో కీలక వికెట్లు తీయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు...

సెకండాఫ్‌లో మాత్రం చాహార్ నుంచి ఆ రేంజ్ పర్ఫామెన్స్ రాలేదు. ఫస్టాఫ్‌లో భారీగా పరుగులు ఇచ్చిన శార్దూల్ ఠాకూర్ మాత్రం సెకండాఫ్‌లో లక్కీ బౌలర్‌గా మారిపోయాడు...

తనకి బంతి అప్పగించిన ప్రతీసారీ జట్టుకి కావాలసిన బ్రేక్స్ ఇస్తూ, అదరగొడుతున్నాడు శార్దూల్ ఠాకూర్. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఈ ఇద్దరికీ చోటు కల్పించడం కోసం మాహీ ఎత్తులు వేస్తున్నాడట...

2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి వచ్చిన దీపక్ చాహార్, జట్టుకి కీ బౌలర్‌గా మారాడు. 2018లో 12 మ్యాచుల్లో 10 వికెట్లు తీసిన దీపక్ చాహార్, 2019లో మరింతగా రాటు తేలాడు...

దీపక్ చాహార్ టాలెంట్‌ను గుర్తించిన ఎమ్మెస్ ధోనీ, 2019లో అతనితో ఏకంగా 17 మ్యాచుల్లో 65 ఓవర్లు వేయించాడు మాహీ. పరుగులు ఎక్కువగా సమర్పిస్తున్నా, అతనికే బౌలింగ్ ఇచ్చి మంచి ఫలితం రాబట్టాడు...

ఆ సీజన్‌లో 22 వికెట్లు తీసిన దీపక్ చాహార్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌లో 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో ఓ వికెట్ మెయిడిన్ ఓవర్ కూడా ఉండడం విశేషం.

ఒత్తిడిని అధిగమించి, క్లిష్ట సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా నియంత్రించి వికెట్లు తీయడంలో సక్సెస్ అయ్యాడు... ఈ సారి కూడా అదే ఫార్ములాను వాడుతున్నాడు మాహీ...

కెప్టెన్‌గా 2007 టీ20 వరల్డ్‌కప్‌ని గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, మెంటర్‌గా తన తొలి టీ20 వరల్డ్‌కప్ టోర్నీని టైటిల్‌తో ముగించాలని భావిస్తున్నాడు..

తన స్నేహితుడు విరాట్ కోహ్లీకి కూడా టీ20 కెప్టెన్‌గా ఇదే ఆఖరి మెగా టోర్నీ కావడంతో నామమాత్రపు మ్యాచుల్లో ప్రయోగాలు చేస్తూ, దీపక్ చాహార్‌‌ను రాటుతేలేలా చేస్తున్నాడని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు...

click me!