IPL2021: మోర్గాన్ పీకిందేం లేదు..! తెర వెనుక నడిపించింది మరొకరు.. KKR కెప్టెన్ పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

First Published Oct 10, 2021, 12:47 PM IST

Gautham Gambhir: భారత జట్టు మాజీ ఓపెనర్, ప్రస్తుత ఎంపీ గౌతం గంభీర్ తన మాజీ జట్టు సహచరుడు Kolkata knight riders సారథి ఇయాన్ మోర్గాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ గా అతడు పీకిందేమీ లేదని వాపోయాడు. 

ఐపీఎల్ ప్లే ఆఫ్ దశకు మరికొద్దిగంటల్లో తెరలేవనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు తుది పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో భారత జట్టు మాజీ ఆటగాడు, కోల్కతా నైట్ రైడర్స్ మాజీ సారథి గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఆ జట్టు తాజా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను టార్గెట్ గా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశాడు గంభీర్. కేకేఆర్ కెప్టెన్ గా మోర్గాన్ చేసిందేమీ లేదని, అంతా  టీమ్ వీడియో అనలిస్టు చేశాడని చెప్పుకొచ్చాడు. 

ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు చేరిన నాలుగు జట్ల సారథుల పనితీరు గురించి గంభీర్ విశ్లేషించాడు. ఈ సందర్భంగా మోర్గాన్ గురించి మాట్లాడుతూ.. ‘మోర్గాన్ సారథిగా చేసిందేమీ లేదు. ఆ జట్టు వీడియో అనలిస్టే వెనకుండి నడిపించాడు. మోర్గాన్ కేవలం అతన్ని ఫాలో అయ్యాడు. గ్రౌండ్ లో కూడా మోర్గాన్ కెప్టెన్ చేసినట్లు నాకు ఎక్కడా అనిపించలేదు. బహుశా అతడు మోర్గాన్ గ్రౌండ్ బయట  సారథిగా ఉన్నాడేమో..’ అంటూ వ్యాఖ్యానించాడు. 

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి స్పందిస్తూ.. ‘విరాట్ కెప్టెన్సీని గతంలో ఎప్పుడూ ఆస్వాదించలేదు. కానీ ఈసారి మాత్రం అతడి ఆటకు ఫిదా అయ్యాను. బహుశా ఇదే ఆఖరు సీజన్ అని కోహ్లి  ప్రశాంతంగా ఉన్నాడేమో. దాంతోనే అద్భుత ప్రదర్శన చేయగలుగుతున్నాడు. అంతేగాక ఈసారి బెంగళూరుకు మంచి బౌలర్లు కూడా దొరికారు. అది కూడా జట్టుకు కలిసొచ్చింది’ అని అన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని సారథ్యం గురించి విశ్లేషిస్తూ.. ‘కెప్టెన్సీ గురించి మాట్లాడాలంటే ధోని బెస్ట్. ఒత్తిడిని హ్యాండిల్ చేయడంలో ధోని సమర్థుడు’ అని చెప్పాడు. 

ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ కు సీనియర్ ఆటగాళ్లు ఉండటం అతడికి కలిసొచ్చిందని గంభీర్ అన్నాడు. స్టీవ్ స్మిత్, ధావన్, అశ్విన్ వంటి ఆటగాళ్లు అతడికి అండగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే కెప్టెన్ గా ధోని మాత్రం నెంబర్ వన్ అని గంభీర్ తెలిపాడు. 

ఇక  ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో భాగంగా ఢిల్లీ, చెన్నై మధ్య జరుగుతున్న నేటి పోరులో ఢిల్లీ క్యాపిటల్సే ఫేవరేట్ అని గంభీర్ అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో చెన్నై కంటే ఢిల్లీ పటిష్టంగా ఉందని గంభీర్ చెప్పాడు. 

click me!