వారం రోజుల క్రితం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో మూడు మ్యాచులుగా బరిలో దిగలేదు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.
ఈ మ్యాచ్‌లో మొదటి సూపర్ ఓవర్ అనంతరం రోహిత్ శర్మ దిగాలుగా కనిపించాడు. డబుల్ సూపర్ ఓవర్‌లో క్రీజులోకే రాలేదు. ఆ తర్వాత రోహిత్ గాయపడ్డాడని చెప్పడం, ఆసీస్ టూర్‌కి ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ పేరు లేకపోవడం చకచకా జరిగిపోయాయి.
రోహిత్ గాయం అంత పెద్దదా? త్వరగానే తగ్గిపోయేదా? అనే విషయాల మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ మధ్య ఉన్న గొడవల కారణంగానే ‘హిట్ మ్యాన్’కి ఇలా జరుగుతోందని ఆరోపిస్తున్నారు అభిమానులు.
భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. విరాట్ కంటే ఏడాది ముందే జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ బ్యాటింగ్ నిలకడలోపం కారణంగా కెప్టెన్సీ దక్కించుకోలేకపోయాడు.
అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి సారథిగా ఎన్నికైన రోహిత్ శర్మ... ప్రీమియర్ లీగ్‌లో అద్భుతాలు చేశాడు. రికార్డు స్థాయిలో నాలుగు సార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపాడు రోహిత్.
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌పై, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్‌పై అత్యధిక విజయాలు అందుకుని తన కెప్టెన్సీ సత్తా నిరూపించుకున్నాడు రోహిత్ శర్మ.
దీంతో రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ ఇవ్వాలనే వాదన తెరపైకి వచ్చింది. ఇది రోహిత్, విరాట్ మధ్య దూరాన్ని పెంచింది. అదీగాక గత ఏడాదిఇంగ్లాండ్ టూర్‌లో రోహిత్ ‘శర్మ’కి బదులుగా అనుష్క ‘శర్మ’ జట్టుతో ఉందంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకి, ‘హిట్ మ్యాన్’ లైక్ కొట్టాడు.
ఈ విషయం వార్తల్లోకి రావడం కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య విబేధాల విషయంపై తారా స్థాయిలో చర్చ జరిగింది. విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క శర్మను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయ్యాడు రోహిత్ శర్మ.
వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు ఓటమికి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి తీసుకున్న నిర్ణయాలే కారణమని రోహిత్ శర్మ ఆరోపించాడని, వారిద్దరూ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆటగాళ్ల అభిప్రాయానికి విలువివ్వడం లేదని రోహిత్ ఫీల్ అయ్యాడని టాక్.
అయితే చాలాసార్లు భారత జట్టులో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అని... హిట్ మ్యాన్ గురించి చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. కానీ రోహిత్ మాత్రం విరాట్ గురించి మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అభిమాని ‘విరాట్ గురించి ఒక్కమాటలో చెప్పండి’ అని అడిగిన ప్రశ్నకు కూడా... ‘స్పెల్లింగ్ సరిగా లేదని’ ఫన్నీగా ఆన్సర్ చేయాలని చూశాడు తప్ప విరాట్ గురించి తన అభిప్రాయం చెప్పలేదు రోహిత్.
విరాట్ కోహ్లీ ఓ రన్ మెషిన్, రోహిత్ శర్మ ఓ హిట్ మ్యాన్.. క్రికెట్ క్రీజులో ఇద్దరూ ఇద్దరే. ఎవరి సత్తా వారిది. కానీ విరాట్‌కి దక్కుతున్న ప్రాధాన్యం, తనకి దక్కడం లేదనేది రోహిత్ శర్మ ఫీల్ అవుతున్నాడని సమాచారం.
ఈ గొడవలన్నింటికీ కోచ్ రవిశాస్త్రియే ప్రధాన కారణం అనేవాళ్లు ఉన్నారు. ఎప్పుడూ మందు తాగుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేసే రవిశాస్త్రి, ఆటగాళ్ల మధ్య మనస్పర్థలు సృష్టించి వాటిని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడని, అందుకే రెండోసారి కూడా కోచ్‌గా ఎన్నికయ్యాడని ఆరోపిస్తున్నారు కొందరు క్రికెట్ అభిమానులు.
అనిల్ కుంబ్లే లాంటి క్రమశిక్షణ పక్కాగా ఫాలో అయ్యే కోచ్‌ని తప్పించి, ఏ మాత్రం క్రమశిక్షణ లేని రవిశాస్త్రిని కోచ్‌గా చేయడంతోనే భారత జట్టుకి శని పట్టిందని నెట్‌లో విమర్శలు చేస్తున్నారు అభిమానులు.
ఇదంతా కాదు రోహిత్ శర్మ భార్య రితికా, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి మధ్య ఏర్పడిన గొడవలే ఈ ఇద్దరు ప్లేయర్ల మధ్య గొడవకి కారణమయ్యాయని ఆరోపించేవాళ్లు ఉన్నారు. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ, ఆ తర్వాత ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు.
రోహిత్ శర్మ ఫోటోల్లో విరాట్ కోహ్లీ, విరాట్ శర్మ తీసిన ఫోటోల్లో రోహిత్ శర్మ ఉండడు. ఇద్దరూ మిగిలిన ప్లేయర్లతో దిగిన ఫోటోలనే సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అంతేకాకుండా లైవ్‌లో కూడా వేర్వేరు ప్లేయర్లతోనే చేస్తుంటారు. రోహిత్, విరాట్ కలిసి ఒక్కసారి కూడా లైవ్ చేయలేదు.
వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని చెప్పడానికి ఇన్ని ఉదాహరణలు చాలని చాలామంది వాదన. ఒకప్పుడు సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్, గంగూలీ వంటి లెజెండ్స్ అందరూ ఒకే జట్టులో ఉన్నా... ఇలాంటి గొడవలు పడలేదు. సచిన్‌కి దక్కే గౌరవంతో మిగిలిన ప్లేయర్లకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రతీ ఒక్కరూ మరో గొప్ప బ్యాట్స్‌మెన్‌తో ఆడడం, భారత జట్టుకి ఆడడం గర్వంగా భావించేవాళ్లు. ఎవ్వరికీ తానే గొప్ప అనే గర్వం ఉండేది కాదు.అది ఈతరం బ్యాట్స్‌మెన్‌లో మిస్ అయ్యింది.
రోహిత్ శర్మకి టీ20 కెప్టెన్సీ అప్పగిస్తే ఈ సమస్యలు తొలగిపోతాయని సలహా ఇస్తున్నారు క్రికెట్ నిపుణులు. చాలాదేశాలు ఈ డబుల్ కెప్టెన్సీ ఫార్ములాను అనుసరిస్తున్నాయని అంటున్నారు.
అయితే ఒక్కసారి ఒక ఫార్మాట్‌తో కెప్టెన్‌ను మారిస్తే... ఇద్దరు కెప్టెన్లను పోల్చడం మొదలెడతారు క్రికెట్ అభిమానులు. అలా జరిగితే ఇరు కెప్టెన్లకు ఇబ్బంది కలుగుతుంది. ఒక ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉండి, మరో ఫార్మాట్‌లో ప్లేయర్‌గా పాల్గొనాలంటే చాలా మెచ్యురిటీతో ఆడాల్సి ఉంటుంది. అంతటి ఓపిక కోహ్లీకి ఉంటుందా? అనేది అందరికీ తెలిసిందే.
కాబట్టి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయంలో కల్పించుకోవాలి. ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య నిజంగా మనస్పర్థలు ఉండి, ఆ విషయంగంగూలీ దృష్టికి వెళితే... సమస్యకు సరైనా పరిష్కరం ‘దాదా’ నే చెప్పగలడని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ గొడవలు ఇలాగే కొనసాగితే మాత్రం భారత జట్టుకి సమస్యగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.