రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై అనుమానాలు... ‘హిట్‌మ్యాన్’ను పరీక్షించనున్న బీసీసీఐ...

First Published | Oct 31, 2020, 4:24 PM IST

IPL 2020 సీజన్‌లో ఆటగాళ్లను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆరడజనుకి పైగా క్రికెటర్లు గాయాల కారణంగా ఐపీఎల్‌కి మధ్యలోనే దూరమయ్యారు. భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్, అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా, ఇషాంత్ శర్మ వంటి వాళ్లు గాయపడి ఐపీఎల్‌కు ఆ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌కి కూడా దూరమయ్యారు. అయితే రోహిత్ శర్మను కూడా ఆసీస్ సిరీస్‌కి ఎంపిక చేయకపోవడంతో వివాదం రేగింది.

రోహిత్ శర్మకు తగిలిన గాయం తగ్గడానికి మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్టు ప్రకటించింది బీసీసీఐ. అందుకే ఐపీఎల్ తర్వాత జరిగే ఆసీస్ టూర్‌కి రోహిత్‌ను ఎంపిక చేయలేదని తెలిపింది.
అయితే రోహిత్ శర్మ కోలుకుంటున్నాడని, త్వరలోనే ముంబై జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని ముంబై ఇండియన్స్ ప్లేయర్ డి కాక్ ప్రకటించడంతో వివాదానికి దారి తీసింది.

రోహిత్ శర్మకు తగిలిన గాయం అంత పెద్దది కాకపోయినా, ఆ వంకతో స్టార్ ప్లేయర్‌ను ఆసీస్ సిరీస్‌కి దూరం పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీంతో మరోసారి దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తోంది బీసీసీఐ. రోహిత్ శర్మకు తగిలిన గాయం తీవ్రత ఎంత? తగ్గడానికి ఎంత సమయం పడుతుందనే విషయాలను తెలుసుకునేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యులు అతన్ని స్వయంగా పరీక్షించనున్నారు.
బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆసీస్ సిరీస్‌లో రోహిత్ శర్మ ఉంటాడా? లేదా? అనేది తేలిపోనుంది.
ఫిట్‌నెస్‌పై పెద్దగా శ్రద్ధ పెట్టని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఈ కారణంగానే చాలాసార్లు గాయాల బారిని పడ్డాడు. తాజాగా రోహిత్ శర్మకు అయిన గాయానికి కూడా ఇదే కారణం.
అక్టోబర్ 18న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో రెండో సూపర్ ఓవర్ సమయంలో క్రీజులోకి రాలేదు రోహిత్ శర్మ.
సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన రోహిత్ శర్మ పరుగు తీసేటప్పుడు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో డబుల్ సూపర్ ఓవర్ సమయంలో రోహిత్ క్రీజులో కనిపించలేదు.
పట్టేసిన తొడ కండరాల నుంచి త్వరగానే కోలుకోవచ్చు. అయితే అది ఆటగాడి ఫిట్‌నెస్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై పెద్దగా ఫోకస్ పెట్టని కారణంగా ఈ గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది.
ఈ గాయం నుంచి కోలుకున్నా... ప్లేయర్ రన్నింగ్ చేస్తూ తొడ కండరాల్లో కదలికలను ఉత్తేజపరచాలి. లేదంటే మళ్లీ గాయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నెలల పాటు సాగే ఆసీస్ టూర్‌లో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ల్లో దేనికీ రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు సెలక్టర్లు.

Latest Videos

click me!