గిల్, అయ్యర్‌లకు చెక్..? మూడో వన్డేలో టీమిండియాలో మార్పులు.. విధ్వంసక ఆటగాళ్లకు ఛాన్స్

First Published Jan 14, 2023, 5:00 PM IST

INDvsSL 3rd ODI: ఇప్పటికే శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గిన భారత్.. తాజాగా రెండ్రోజుల క్రితం ముగిసిన రెండో వన్డేలో  గెలిచి వన్డే సిరీస్ కూడా  సొంతం చేసుకుంది. మూడో వన్డే  ఆదివారం తిరువనంతపురం వేదికగా జరుగుతుంది. 

కొత్త ఏడాదిని భారత జట్టు  ఘనంగా ఆరంభించింది. తొలుత యువ భారత్..  టీ20 సిరీస్ నెగ్గగా   తర్వాత  సీనియర్లు  వన్డే సిరీస్ లో భాగంగా తొలి రెండు వన్డేలను గెలిచారు. ఇక నామమాత్రమైన మూడో వన్డే రేపు (ఆదివారం) తిరువనంతపురంలో జరుగనుంది.  
 

అయితే ఈ వన్డేలో భారత్ పలు మార్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  వన్డే సిరీస్ నెగ్గిన నేపథ్యంలో బెంచ్ పై ఉన్న ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు  టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నది. ఈ నేపథ్యంలో  గత రెండు మ్యాచ్ లు ఆడిన శుభమన్ గిల్ తో పాటు శ్రేయాస్ అయ్యార్ లకు  మూడో వన్డేలో ఛాన్స్ దక్కేది అనుమానంగానే మారింది.  

గిల్.. తొలి వన్డేలో  70 పరుగులు చేశాడు. కానీ రెండో వన్డేలో 21 పరుగులకే వెనుదిరిగాడు. ఇక శ్రేయాస్ అయ్యర్.. రెండు వన్డేలలో మంచి ఆరంభాలే చేసినా తర్వాత వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో  ఈ ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి  తొలి రెండు మ్యాచ్ లకు బెంచ్ మీదున్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్  లను తుది జట్టులో ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

బంగ్లాదేశ్ తో  వన్డే సిరీస్ లో భాగంగా మూడో  మ్యాచ్ లో ఇషాన్ డబుల్ సెంచరీ  బాదిన విషయం తెలిసిందే.  అయితే  లంకతో  వన్డే సిరీస్ లో భాగంగా తొలి రెండు వన్డేలలో అతడికి చోటు దక్కలేదు.  దీంతో రోహిత్ తో పాటు టీమ్ మేనేజ్మెంట్ పై విమర్శలు వెల్లువెత్తాయి.  

మరోవైపు  టీ20లలో కెరీర్ లో పీక్స్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ను కాదని వన్డేలలో శ్రేయాస్ ను ఆడించడం కూడా విమర్శలకు తావిచ్చింది. గత ఏడాది కాలంగా వన్డేలలో గిల్, అయ్యర్ నిలకడగా రాణిస్తున్నారని, అందుకే వాళ్లకు అవకాశాలిచ్చామని  రోహిత్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.

ఇక రెండో వన్డే ముగిసిన తర్వాత  రోహిత్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్ తో మేం మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.   అందుకే ఆటగాళ్లకు ఫ్రెష్ మూడ్ తో ఉంచాలని మేం భావిస్తున్నాం.  తర్వాత కూడా మేం చాలా మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని ముందుకెల్తున్నాం.   అవసరమైతే మూడో వన్డేలో పలు మార్పులు కూడా చేస్తాం..’అని చెప్పాడు. 
 

గిల్, అయ్యర్ లతో పాటు  హార్ధిక్ పాండ్యా, మహ్మద్ షమీలకు కూడా   రెస్ట్ ఇవ్వనున్నారని సమాచారం. చాహల్ ను తిరిగి జట్టుతో చేర్చి  అర్ష్‌దీప్ సింగ్ ను  కూడా ఫాస్ట్ బౌలర్ల కోటాలో తీసుకునే  అవకాశాలున్నాయని  జట్టు వర్గాలు తెలిపాయి.  తిరువనంతపురం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది కావున  నలుగురు  పేసర్లతో ఆడాలని భావిస్తే హార్ధిక్ ను జట్టుతోనే ఉంచుతారు. 
 

click me!