‘ఇక బీసీసీఐతో చాలు.. ఇక్కడ 30 ఏండ్లు వస్తే వృద్ధుడిలా చూస్తున్నారు.. అందుకే వేరే దేశాల్లో..’

First Published Jan 14, 2023, 4:12 PM IST

గతంలో భారత జట్టుకు టెస్టులలో ఓపెనర్ గా వచ్చిన  వెటరన్ బ్యాటర్ మురళీ విజయ్  కు  ప్రస్తుతం జట్టులో చోటు లేదు.  నాలుగేండ్ల నుంచి అతడి గురించి పట్టించుకున్నవారూ లేరు.  దీంతో అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. 

బీసీసీఐతో తన బంధం ముగిసినట్టేనని.. తాను విదేశీ లీగ్ లలో ఆడేందుకు యత్నిస్తున్నానని  టీమిండియా వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్ అంటున్నాడు.  అవకాశం దొరికితే ఇప్పటికిప్పుడు వెళ్లి ఆడాలన్నంత కసిలో ఉన్నానని తెలిపాడు.  భారత్ లో 30 ఏండ్లు నిండిన క్రికెటర్లపై వివక్ష చూపుతున్నారని,  వాళ్లను 80 ఏండ్ల వృద్ధుడిలా చూస్తున్నారని వాపోయాడు. 

టీమిండియా మాజీ క్రికెటర్, గతంలో  భారత మహిళా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా పనిచేసిన డబ్ల్యూ.వి. రామన్ తో  స్పోర్ట్స్ స్టార్  లో జరిగిన  చర్చా కార్యక్రమంలో  విజయ్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశాడు. విజయ్ మాట్లాడుతూ... ‘బీసీసీఐతో నా బంధం  దాదాపు ముగిసినట్టే. నేను విదేశాల్లో ఆడేందుకు ఎదురుచూస్తున్నా.  నాలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది. 

భారత్ (క్రికెటర్ల కెరీర్ గురించి ప్రస్తావిస్తూ..) లో 30 ఏండ్లు దాటిన తర్వాత  వీధిలో వెళ్లే  80 ఏండ్ల వృద్ధుడిలా చూస్తారు. మీడియా కూడా  వారిని  మరో రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పటికిప్పుడు చెబుతున్నా.. ఇప్పుడు కూడా నేను బాగా బ్యాటింగ్ చేయగలను. కానీ దురదృష్టవశాత్తూ.. ఇక్కడ నాకు అవకాశాలు లేవు. అందుకే విదేశాలలో అవకాశాల కోసం వెతుక్కుంటున్నా.. 

నేను నిజాయితీగా చెబుతున్నాను.  మన చేతిలో ఉన్నది మాత్రమే మనం చేయగలం. మన చేతిలో లేని వాటిని మనం నియంత్రించలేం. తర్వాత ఏం జరగాల్సి ఉంటే అది జరుగుతుంది..’అని తెలిపాడు. 

38 ఏండ్ల విజయ్ భారత్ తరఫున 61 టెస్టులు  ఆడి 38.29 సగటుతో 3,982 పరుగులు చేశాడు.  ఇందులో 12 సెంచరీలు కూడా ఉండటం గమనార్హం.  అంతేగాక 17 వన్డేలు (399 రన్స్), 9 టీ20లు (169 రన్స్) ఆడాడు.  

విజయ్ చివరిసారిగా 2018లో భారత్ తరఫున ఆడాడు. 2018 డిసెంబర్ లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటించినప్పుడు    పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆడాడు. ఆ టెస్టులో 0,20 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్లీ అతడు జాతీయ జట్టుకు ఆడలేదు. ఇక దేశవాళీలో కూడా 2019 తర్వాత అతడు ఆడలేదు.  ఐపీఎల్ లో 2016లో పంజాబ్ కింగ్స్ కు సారథిగా కూడా వ్యవహరించాడు. 

click me!