మూడేండ్ల తర్వాత హిట్‌మ్యాన్ సెంచరీ.. పాంటింగ్ రికార్డు సమం..

First Published Jan 24, 2023, 4:39 PM IST

Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ  చాలాకాలం తర్వాత మూడంకెల స్కోరుకు చేరాడు.  మూడేండ్లుగా  వన్డేలలో సెంచరీ  చేయలేక తంటాలు పడుతున్న హిట్‌మ్యాన్ ఎట్టకేలకు   న్యూజిలాండ్ తో మూడో వన్డేలో  ఆ  పని కానిచ్చేశాడు. 

2020 జనవరి 19.. రోహిత్ శర్మ  చివరిసారి వన్డేలలో సెంచరీ చేసిన తేదీ అది. అప్పట్నుంచి   మొన్నటి రాయ్‌పూర్ వన్డే దాకా  రోహిత్ ఈ మూడేండ్లలో  వన్డేలలో మళ్లీ సెంచరీ చేయలేదు.  మధ్యలో  2021లో ఇంగ్లాండ్ టూర్ లో  శతకం బాదిన అది టెస్టులలోది.  దీంతో రోహిత్ సెంచరీ కోసం అతడి అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూశారు. 

రోహిత్ కంటే ముందు కోహ్లీ కూడా ఈ ఫేజ్ ను అనుభవించాడు. 2019 నుంచి 2022 దాకా  విరాట్ బ్యాట్ నుంచి  మూడంకెల స్కోరు రాలేదు.  రోజులు గడుస్తున్నా..  మూడు ఫార్మాట్లలో మ్యాచ్ ల మీద మ్యాచ్ లు ఆడుతున్నా కోహ్లీ  మాత్రం  దారుణంగా విఫలమయ్యేవాడు. కానీ ఎట్టకేలకు గతేడాది   ఆగస్టులో  ఆసియా కప్  వేదికగా ఆఫ్గానిస్తాన్ పై  సెంచరీ బాది   మూడేండ్ల నిరీక్షణకు తెరదించాడు. 

కోహ్లీ సెంచరీ తర్వాత భారత అభిమానులు అంతగా వేచి చూసింది  రోహిత్  గురించే..  2021 నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి 51 ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్.. మూడంకెల స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. పలుమార్లు వన్డేలలో 80లలోకి వచ్చినా వాటిని   సెంచరీలుగా మలచలేదు. మంచి టచ్ లోనే ఉన్నా శుభారంభాలు అందించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో రోహిత్ విఫలమయ్యాడు. 

Image credit: PTI

వన్డేలలో 2020లో సెంచరీ చేసిన తర్వాత రోహిత్.. 16 ఇన్నింగ్స్ ఆడాడు.   ఈ స్కోర్లు ఇలా ఉన్నాయి. 28, 25, 37, 60, 5, 13, 76, 0, 17, 27, 51, 83, 17, 42, 34, 51.  నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నా వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు.  ఈ మ్యాచ్ లో  సెంచరీ చేయడం ద్వారా  రోహిత్ వన్డేలలో 30వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

ఇండోర్ వన్డేలో సెంచరీ చేయడం ద్వారా రోహిత్.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అత్యధిక  సెంచరీలు సాధించినవారి జాబితాలో   మూడో స్థానంలో ఉన్న పాంటింగ్ ను సమం చేశాడు. పాంటింగ్..  365 ఇన్నింగ్స్  లలో  30 సెంచరీలు చేయగా  రోహిత్.. 234 ఇన్నింగ్స్ లలోనే ఆ ఫీట్ అందుకున్నాడు.  

రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ..   261  ఇన్నింగ్స్ లో  46 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్.. 452 ఇన్నింగ్స్ లలో  49 సెంచరీలతో  అగ్రస్థానంలో ఉన్నాడు. మరో  నాలుగు సెంచరీలు చేస్తే కోహ్లీ.. సచిన్ ను అధిగమిస్తాడు.

click me!