INDvsENG: నిలబడిన పూజారా, విరాట్ కోహ్లీ... కీలకంగా నాలుగో రోజు ఆట...

First Published Aug 27, 2021, 11:09 PM IST

మూడో టెస్టులో మూడో రోజు ఆటను టీమిండియా డామినేట్ చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది భారత జట్టు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 139 పరుగులు వెనకబడి ఉంది టీమిండియా... 

తొలి సెషన్‌లో కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది టీమిండియా. 54 బంతుల్లో 8 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఓవర్టన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో పట్టిన కళ్లుచెదిరే క్యాచ్‌కి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత రోహిత్ శర్మ, పూజారా కలిసి రెండో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఫలితంగా రెండో సెషన్‌లో వికెట్లేమీ కోల్పోకుండా బ్యాటింగ్ చేసింది భారత జట్టు.

156 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రాబిన్‌సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 

 మూడో సెషన్ ప్రారంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోయింది టీమిండియా. అయితే విరాట్ కోహ్లీతో కలిసి దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు ఛతేశ్వర్ పూజారా.

తన శైలికి విరుద్ధంగా దూకుడుగా బ్యాటింగ్ చేసిన ఛతేశ్వర్ పూజారా... 180 బంతుల్లో 15 ఫోర్లతో 91 పరుగులు చేసి, విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. 

పూజారా, కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 99 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు...
ఇంగ్లాండ్ స్కోరుకి ఇంకా 139 పరుగుల దూరంలో ఉంది భారత జట్టు. 

దీంతో నాలుగో రోజు ఆట మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది. భారత జట్టు ఈ మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే రేపు మూడు సెషన్లపాటు బ్యాటింగ్ చేసి, ప్రత్యర్థికి కనీసం 180+ లక్ష్యాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది...

click me!