345 పరుగుల ఆధిక్యం, చేతిలో ఇంకా రెండు వికెట్లు... టీమిండియా ఓటమి నుంచి...

First Published Aug 26, 2021, 11:13 PM IST

మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 423 పరుగుల భారీ స్కోరు చేసింది ఇంగ్లాండ్. టీమిండియాపై తొలి ఇన్నింగ్స్‌లోనే 345 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుంది ఇంగ్లాండ్...

చేతిలో ఇంకా రెండు వికెట్లు ఉండడంతో మూడో రోజు ఉదయం సెషన్‌లో కూడా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 120/0 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు...

రెండో రోజు మొదటి సెషన్‌లో రోరీ బర్న్స్ 61 పరుగులు, హసీబ్ హమీద్ (68 పరుగులు) వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, టీ బ్రేక్‌కి ముందు డేవిడ్ మలాన్ 70 పరుగులు వికెట్ కోల్పోయింది... 

ఆ తర్వాత 43 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టోని మహ్మద్ షమీ అవుట్ చేశాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ కూడా షమీ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు.

జో రూట్ మరోసారి భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ... సిరీస్‌లో మూడో సెంచరీ నమోదుచేశాడు. సిరీస్‌లో 500+ పరుగులు చేసిన జో రూట్, ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు... ఇరుజట్లలో మిగిలిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా 250 పరుగులు కూడా చేయలేకపోవడం విశేషం...

టీమిండియాపై జో రూట్‌కి ఇది 8వ టెస్టు సెంచరీ కాగా, ఓవరాల్‌గా 11వ సెంచరీ. టీమిండియాపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన జో రూట్... రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్ తర్వాత భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

12 బంతుల్లో 7 పరుగులు చేసిన బట్లర్ అవుటైన తర్వాత 165 బంతుల్లో 14 ఫోర్లతో 121 పరుగులు చేసిన జో రూట్‌ను జస్ప్రిత్ బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు... ఈ మ్యాచ్‌లో బుమ్రా 24 ఓవర్లు వేసిన తర్వాత తొలి వికెట్ దక్కడం విశేషం.

జో రూట్ అవుటైన తర్వాత 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 383 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

ఆ తర్వాత క్రెగ్ ఓవర్టన్, సామ్ కుర్రాన్ కలిసి 8 వికెట్‌కి 35 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 30 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన కుర్రాన్, సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఇప్పటికే 345+ పరుగుల ఆధిక్యంలో ఉంది ఇంగ్లాండ్ జట్టు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు, ప్రత్యర్థికి తొలి ఇన్నింగ్స్‌లో 300+ ఆధిక్యం అందించడం ఇదే తొలిసారి. చివరిగా ధోనీ కెప్టెన్సీలో 2014లో టీమిండియా ఇలాంటి చెత్త ప్రదర్శన ఇచ్చింది.

click me!