INDvsENG 2nd test: ముగిసిన నాలుగోరోజు ఆట... ఆఖర్లో బ్యాడ్ లైట్ గురించి హై డ్రామా...

First Published Aug 15, 2021, 10:50 PM IST

లార్డ్స్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది టీమిండియా...  ఇంగ్లాండ్‌కి 154 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, ఐదో రోజు తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించాలని భావించే అవకాశం ఉంది. 

 కెఎల్ రాహుల్ 5, రోహిత్ శర్మ 21, విరాట్ కోహ్లీ 20 పరుగులు చేసి అవుట్ కావడంతో  55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే కలిసి నాలుగో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాను ఆదుకున్నారు. 

206 బంతుల్లో 4 ఫోర్లతో 45 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారాను మార్క్ వుడ్ అవుట్ చేశాడు... దాదాపు 50 ఓవర్ల పాటు కొనసాగిన నాలుగో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు మార్క్ వుడ్..

146 బంతుల్లో 5 ఫోర్లతో 61 పరుగులు చేసిన అజింకా రహానే... మొయిన్ ఆలీ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టెస్టుల్లో మొయిన్ ఆలీ బౌలింగ్‌లో రహానే అవుట్ అవ్వడం ఇది 8వ సారి...

రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా కూడా మొయిన్ ఆలీ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 5 బంతులాడి 3 పరుగులు చేసిన జడేజా... మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 175 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది భారత జట్టు.

మ్యాచ్ మరో 9 ఓవర్లలో ముగిస్తుందనగా వెలుతురు మందగించడంతో హై డ్రామా నడిచింది. లైట్ కావాల్సినంత లేకపోవడంతో మ్యాచ్‌ను నిలిపివేయకుండా ఉండేందుకు పాత బంతితోనే స్పిన్నర్ మొయిన్ ఆలీతో పాటు తాను బౌలింగ్ వేయడం కొనసాగించాడు జో రూట్...

అయితే బ్యాడ్ లైట్‌లోనూ ఆటను కొనసాగించడంపై బాల్కనీ నుంచి భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా అసహనం వ్యక్తం చేశారు.. క్రీజులో ఉన్న ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్‌కి వాళ్లేం చెబుతున్నారో అర్థం కాకపోవడంతో డ్రింక్స్ కోరారు. 

డ్రింక్స్ తీసుకొచ్చిన హనుమ విహారి, విషయాన్ని చెప్పడం... భారత బ్యాట్స్‌మెన్ అంపైర్లను కోరడంతో ఇంకో 8 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను నిలిపివేశారు అంపైర్లు... రిషబ్ పంత్ 29 బంతుల్లో 14 పరుగులు, ఇషాంత్ శర్మ 10 బంతుల్లో 4 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.

ఇంగ్లాండ్‌కి 154 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, ఐదో రోజు తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించాలని భావించే అవకాశం ఉంది. 
ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ అవుట్ కావడంతో క్రీజులో ఉన్న రిషబ్ పంత్, ఎంత సేపు బ్యాటింగ్ చేస్తాడు, ఎన్ని పరుగులు చేస్తాడనేదానిపైనే ఇంగ్లాండ్ టార్గెట్ నిర్ణయించబడుతుంది...

click me!