INDvsENG 2nd Test: ఆధిక్యంలోకి ఇంగ్లాండ్... జో రూట్ రికార్డు సెంచరీ...

First Published Aug 14, 2021, 11:02 PM IST

లార్డ్స్ టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ జో రూట్ మరోసారి భారీ శతకంతో అదరగొట్టగా జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీ చేశాడు. టెయిలెండర్లతో కలిసి కూడా అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పిన జో రూట్... భారీ శతకంతో చెలరేగి ఇంగ్లాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు... ఇంగ్లాండ్‌కి దక్కిన ఆధిక్యంలో నో బాల్స్ ద్వారా 16 పరుగులు రావడం విశేషం. 

డొమినిక్ సిబ్లీ 11, హసీబ్ హమీద్ డకౌట్ కాగా రోరీ బర్న్స్ 49 పరుగులు చేసి అవుట్ కావడంతో 108 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జానీ బెయిర్ స్టో, జో రూట్ కలిసి ఆదుకున్నారు...

ఓవర్‌నైట్ స్కోరు 119/3 పరుగుల వద్ద ఇన్నింగ్స్ మొదలెట్టిన ఇంగ్లాండ్... తొలి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా లంచ్ బ్రేక్‌కి వెళ్లింది. నాలుగో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బెయిర్ స్టో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్..

107 బంతుల్లో 7 ఫోర్లతో 57 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టోని అవుట్ చేసిన సిరాజ్... టీమిండియాకి కావాల్సిన బ్రేక్‌కి అందించాడు. అయితే జోస్ బట్లర్‌తో కలిసి ఐదో వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు జో రూట్...

42 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసిన జోస్ బట్లర్‌ను ఇషాంత్ శర్మ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మొయిన్ ఆలీతో కలిసి ఆరో వికెట్‌కి 58 పరుగులు జోడించాడు జో రూట్... 

72 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన మొయిన్ ఆలీని అవుట్ చేసిన ఇషాంత్ శర్మ, ఆ తర్వాతి బంతికే సామ్ కుర్రాన్‌ను డకౌట్ చేశాడు. దీంతో 341 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

ఆ తర్వాత ఓల్లీ రాబిన్‌సన్ 22 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి... సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సిరాజ్ వేసిన అంతకుముందు ఓవర్‌లో అంపైర్స్ కాల్స్ కారణంగా మూడు సార్లు బతికిపోయిన రాబిన్‌సన్, అంపైర్స్ కాల్ వల్లే అవుట్ కావడం విశేషం... 

టెస్టుల్లో 22వ సెంచరీ, కెప్టెన్‌గా 11వ సెంచరీ నమోదుచేసిన జో రూట్... టెస్టుల్లో 9 వేల పరుగులను అందుకున్నాడు. ఇదే ఏడాది ఐదు టెస్టు సెంచరీలు నమోదుచేసిన జో రూట్... ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 16 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు...

23 బంతుల్లో 5 పరుగులు చేసిన మార్క్ వుడ్ రనౌట్ కాగా ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో పాతుకుపోయిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్... 321 బంతుల్లో 18 ఫోర్లతో 180 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

23 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కుతుందని ఆశపడిన టీమిండియా అభిమానులకు జో రూట్ నిజమైన టెస్టు ఇన్నింగ్స్‌లో ఊహించని షాక్ ఇచ్చాడు. జో రూట్‌కి తోడు మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో ఇంగ్లాండ్‌కి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది... 

భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్‌కి నాలుగు వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ ఓ వికెట్ తీయగా... జస్ప్రిత్ బుమ్రా వికెట్లేమీ తీయకపోయినా తన స్పెల్‌లో ఏకంగా 12 నో బాల్స్ వేయడం విశేషం... ఇందులో ఓ ఓవర్‌లో మూడు, ఓ ఓవర్‌లో నాలుగేసి నో బాల్స్ వేశాడు బుమ్రా...

click me!