INDvsENG 1st Test: తొలిరోజు మనదే... ఇంగ్లాండ్‌పై పూర్తి ఆధిపత్యం చూపించిన టీమిండియా...

First Published Aug 4, 2021, 11:09 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు భారత జట్టు ఆధిపత్యం కనబర్చింది. ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకి ఆలౌట్ చేసిన టీమిండియా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 21 పరుగులు చేసింది...

కెఎల్ రాహుల్ 39 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 40 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 162 పరుగులు వెనకబడి ఉంది టీమిండియా.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 183 పరుగులకి ఆలౌట్ అయ్యింది...  తొలి సెషన్‌లో, రెండో సెషన్‌లో రెండేసి వికెట్లు తీసిన భారత బౌలర్లు, మూడో సెషన్‌లో పూర్తి ఆధిపత్యం చూపించారు.

టీ బ్రేక్ సమయానికి 138/4 వద్ద ఉన్న ఇంగ్లాండ్ జట్టు, మూడో సెషన్‌లో వరుస వికెట్లు కోల్పోయి 183 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 47 పరుగుల తేడాతో ఆరు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్.  

66 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన దశలో జో రూట్, జానీ బెయిర్ స్టో కలిసి ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షమీ విడదీశాడు.

71 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన బెయిర్‌స్టో, షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 108 బంతుల్లో 11 ఫోర్లతో 64 పరుగులు చేసిన జో రూట్, శార్దూల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

160 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో దూకుడుగా ఆడిన సామ్ కుర్రాన్ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసి, అండర్సన్‌తో కలిసి 9వ వికెట్‌కి 23 పరుగుల భాగస్వామ్యం జోడించాడు.  కుర్రాన్ నాటౌట్‌గా నిలవగా అండర్సన్‌ను బుమ్రా అవుట్ చేశాడు. 

భారత బౌలర్లలో మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్‌కి రెండు వికెట్లు దక్కాయి. మహ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీశాడు. 

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో రోరీ బర్న్స్, జోస్ బట్లర్, డానియల్ లారెన్స్, ఓల్లీ రాబిన్‌సన్ డకౌట్ అయ్యాడు. ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం, టీమిండియాపై ఇదే తొలిసారి. 

తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు చేసే స్కోరును బట్టి మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఓ రకంగా మ్యాచ్ ఫలితాన్ని రేపటి ఆట డిసైడ్ చేయనుంది. 

click me!