INDvsENG: అదరగొట్టిన భారత బౌలర్లు... తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టును ముప్పుతిప్పలు పెట్టి...

First Published Aug 4, 2021, 9:53 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలో దిగిన ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్ జట్టు...  

ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి సెషన్‌లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, రెండో సెషన్‌లో 50.2 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు...

తొలి ఓవర్‌లో రోరీ బర్న్స్, బుమ్రా బౌలింగ్‌లో డకౌట్ కాగా 27 పరుగులు చేసిన జాక్ క్రావ్లీని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. తొలి సెషన్‌లో 61/2 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. 

రెండో సెషన్ ఆరంభించిన తర్వాత కొద్దిసేపటికే డొమినిక్ సిబ్లీ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు.  70 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన సిబ్లీ, మహ్మద్ షమీ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

66 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జో రూట్, జానీ బెయిర్ స్టో కలిసి ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షమీ విడదీశాడు.

71 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన బెయిర్‌స్టో, షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్‌కి వెళ్లిన టీమిండియాకి అనుకూలంగా ఫలితం దక్కింది...

మూడో సెషన్ ప్రారంభంలోనే డానియల్ లారెన్స్‌ను డకౌట్ చేశాడు మహ్మద్ షమీ. నాలుగు బంతులాడిన లారెన్స్, రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 138 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ 18 బంతులు ఆడిన ఒక్క పరుగు కూడా చేయకుండానే బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో బౌండరీలు సాధిస్తూ నిలదొక్కుకుపోయిన జో రూట్‌ని శార్దూల్ ఠాకూర్ పెవిలియన్‌కి పంపాడు.

undefined

అదే ఓవర్‌లో ఓల్లీ రాబిన్‌సన్ కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి, మహ్మద్ షమీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 4 పరుగులు చేసిన స్టువర్ట్ బ్రాడ్, బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కావడంతో 160 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్.... 

భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, జస్ప్రిత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్‌కి రెండు వికెట్లు దక్కాయి. మహ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీశాడు. 

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో రోరీ బర్న్స్, జోస్ బట్లర్, డానియల్ లారెన్స్, ఓల్లీ రాబిన్‌సన్ డకౌట్ అయ్యాడు. ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం, టీమిండియాపై ఇదే తొలిసారి. 

160 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో దూకుడుగా ఆడిన సామ్ కుర్రాన్ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసి, అండర్సన్‌తో కలిసి 9వ వికెట్‌కి 23 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. 

click me!