హమ్మయ్యా.. పంత్ లేడు, ఆస్ట్రేలియా హ్యాపీ : ఆసీస్ మాజీ క్రికెటర్ కామెంట్స్

First Published Feb 7, 2023, 1:09 PM IST

Border Gavaskar Trophy:  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఈనెల 9 నుంచి  తొలి టెస్టు మొదలుకానుంది.  కానీ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి పంత్  ఆడటం లేదు. 

మరో రెండ్రోజుల్లో మొదలుకాబోయే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టులో  యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ లేకపోవడం  తమకు చాలా హ్యాపీ అని అంటున్నాడు ఆ జట్టు మాజీ ఆటగాడు ఇయాన్ చాపెల్. పంత్ అటాకింగ్  ప్లేయర్ అని..  అతడు  ఉంటే ఆసీస్ కు తిప్పలు తప్పకపోవని తెలిపాడు. 

నాగ్‌పూర్  టెస్టు ప్రారంభానికి ముందు చాపెల్ స్టార్ స్పోర్ట్స్  తో మాట్లాడుతూ... ‘ఈసారి బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో  రిషభ్ పంత్ లేకపోవడం భారత్ కు పెద్ద లోటు.  కానీ ఆస్ట్రేలియన్లు మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతారు.    ఎందుకంటే పంత్  కౌంటర్ అటాకింగ్ క్రికెటర్.  ఏ క్షణంలో అయినా మ్యాచ్ ను  మార్చగలడు. 

దూకుడుగా ఆడుతూ పరుగులు చేయడంలో పంత్ దిట్ట.   ఒక మంచి సెషన్   కలిసివస్తే  పంత్  ఎలా రెచ్చిపోతాడో మనందరికీ తెలుసు.   అలాంటి పంత్ లేకపోవడం భారత్ కు కచ్చితంగా లోటే..’అని తెలిపాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా   జరిగిన 2019-20, 2021  సిరీస్ లలో  పంత్  భారత్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్నాడు. 

కాగా.. రిషభ్ పంత్  గతేడాది డిసెంబర్ 30న  రోడ్డు ప్రమాదంలో గాయపడి  ప్రస్తుతం ముంబైలోని  కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఈ నెలలో అతడు  ఆస్పత్రి నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. పంత్ మోకాలికి ఇటీవలే శస్త్రచికిత్స  జరుగగా  విజయవంతమైంది.  మార్చిలో మరో ఆపరేషన్ ఉండనున్నట్టు  తెలుస్తున్నది. 
 

ఇదిలాఉండగా  పంత్ రిప్లేస్మెంట్ గా ఎవరిని ఎంపిక చేయాలన్నది   టీమ్ మేనేజ్మెంట్ కు తలనొప్పిగా మారింది.  ప్రస్తుతం టీమ్ లో స్పెషలిస్టు వికెట్ కీపర్లుగా  ఇషాన్ కిషన్, కెఎస్ భరత్ ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి  తుది జట్టులో చోటు దక్కొచ్చని తెలుస్తున్నది.  

అయితే ఇషాన్, భరత్ తో పాటు  కెఎల్ రాహుల్ కూడా వికెట్ కీపింగ్ చేయగలిగినవాడే.  ఆసీస్ ను కట్టడిచేయాలంటే  తుది జట్టులోకి మూడో  స్పిన్నర్ ను తీసుకోక తప్పదని భావిస్తున్న రోహిత్ శర్మ..  ఇషాన్, భరత్ లను పక్కనబెట్టి  రాహుల్ తో వికెట్ కీపింగ్  చేయించేందుకు సిద్ధమవుతున్నాడట.   

click me!