ధోనీ, విరాట్ కోహ్లీల వల్లే కాలేదు, రిషబ్ పంత్ సాధిస్తాడా... సౌతాఫ్రికాతో మూడో టీ20కి ముందు...

First Published Jun 14, 2022, 10:50 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత వారం రోజుల గ్యాప్‌లో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొదలెట్టింది టీమిండియా. సౌతాఫ్రికా క్రికెటర్లు ఫ్రెష్‌గా టీమిండియా సిరీస్ మొదలెడితే, భారత క్రికెటర్లు మాత్రం రెండున్నర నెలల పాటు తీవ్రమైన ప్రాక్టీస్, మ్యాచుల అలసట నుంచి తేరుకోకముందే టీ20 సిరీస్‌ ఆడుతున్నారు...

స్వదేశంలో వరుసగా సిరీసులు గెలవడమే కాదు, క్లీన్ స్వీప్‌ చేస్తూ వస్తున్న భారత జట్టు... సౌతాఫ్రికాపై మాత్రం ఆ ఫీట్ సాధించలేకపోయింది. రిషబ్ పంత్ కెప్టెన్సీలో మొదటి రెండు టీ20 మ్యాచుల్లో చిత్తుగా ఓడింది టీమిండియా...

సిరీస్ నిలుపుకోవాలంటే మూడో టీ20 మ్యాచ్‌ తప్పకుండా గెలిచి తీరాల్సిందే. విశాఖపట్నంలోని డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగే మూడో టీ20 మ్యాచ్ ఓడితే, మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయినట్టు అవుతుంది భారత జట్టు...

Latest Videos


వాస్తవానికి ఇప్పటిదాకా స్వదేశంలో సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ గెలవలేకపోయింది భారత జట్టు. ఇంతకుముందు 2015,2019ల్లో సౌతాఫ్రికా జట్టు, భారత్‌లో పర్యటించింది. అంతకుముందు ఇరుజట్ల మధ్య టీ20 మ్యాచులు జరిగినా, ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌లుగానే జరిగాయి తప్ప సిరీస్‌లు జరగలేదు...

2015లో భారత పర్యటనకి వచ్చిన సౌతాఫ్రికా, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టును 2-0 తేడాతో చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది. ధర్మశాలలో జరిగిన టీ20లో 7 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడింది..

2018లో సౌతాఫ్రికా టూర్‌లో టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో గెలిచిన టీమిండియా, స్వదేశంలో మాత్రం ఆ ఫీట్ రిపీట్ చేయలేకపోయింది. ధర్మశాలలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మొహాలీలో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు..

అయితే బెంగళూరులో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో గెలిచిన సౌతాఫ్రికా, సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు 2-0 తేడాతో సిరీస్ కోల్పోతే, కోహ్లీ కెప్టెన్సీలో సిరీస్ డ్రాగా ముగిసింది...

ఇప్పుడు స్వదేశంలో టీ20 సిరీస్ గెలిచిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలవాలంటే రిషబ్ పంత్, మిగిలిన మూడు మ్యాచుల్లోనూ సౌతాఫ్రికాని ఓడించాల్సి ఉంటుంది. ఈ ఫీట్ క్రియేట్ చేస్తే మాత్రం టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో రిషబ్ పంత్, మిగిలిన వారిని వెనక్కినెట్టడం గ్యారెంటీ అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..

click me!