నాగబాబును వదలని నెటిజన్లు... మీరెక్కడ తయారయ్యారు బాబూ, మ్యాచ్ చూడడం కూడా తప్పేనా...

First Published | Oct 25, 2021, 4:13 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఓటమిని అభిమానులు జీర్ణీంచుకోలేకపోతున్నారు. అదీ నమీబియా, స్కాట్లాండ్ వంటి చిన్న జట్టుతో ఓడినా పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదేమో కాని, పొరుగుదేశం పాకిస్తాన్ చేతుల్లో ఓడడంతో అస్సలు తట్టుకోలేకపోతున్నారు...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి ప్రభావం పరోక్షంగా చాలామంది పైనే పడింది. ముఖ్యంగా ఈ రోజు ఎలాగైనా భారత జట్టు గెలుస్తుందని కామెంట్ చేసిన గౌతమ్ గంభీర్, తిట్టిన తిట్టు తిట్టకుండా దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు...

గౌతమ్ గంభీర్ ఏ జట్టు గెలుస్తుందని అంచనా వేస్తే, ఆ జట్టు ఓడిపోతుందనేది క్రికెట్ ఫ్యాన్స్ నమ్మకం. ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియా గెలుపు ఖాయమని వ్యాఖ్యానించడమే గంభీర్ తప్పైపోయింది...


ఇండియాలో పుట్టి, టీమిండియాకి ఆడి, భారత జట్టుపై నమ్మకం ఉండకూడదా? టీమిండియా గెలుస్తుందని కాక, పాకిస్తాన్ జట్టు గెలుస్తుందని కామెంట్ చేయమంటారా? అలా చేసి ఉంటే ఇప్పుడు ట్రోల్ చేస్తున్న ఈ నెటిజన్లే, దేశద్రోహి అంటూ బతకనిచ్చేవాళ్ళు కూడా కాదేమో...

గౌతమ్ గంభీర్ తర్వాత ఈ మ్యాచ్‌తో, క్రికెట్ విశ్లేషణలతో సంబంధం లేకపోయినా ఆ రేంజ్ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు టాలీవుడ్ నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు...

ప్రస్తుతం కొడుకు వరుణ్‌తేజ్‌తో కలిసి యూఏఈలో ఉన్న నాగబాబు, ఆదివారం ఇండియా, పాకిస్తాన్‌ చూడడానికి దుబాయ్ స్టేడియానికి వెళ్లడమే ఈ ట్రోలింగ్‌కి ప్రధాన కారణం...

సినిమాల్లో నిర్మాతగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన నాగబాబు, ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రాంచరణ్‌తో ‘ఆరెంజ్’ మూవీ తీసి అప్పులపాలయ్యాడనని చాలాసార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

సినిమాల విషయం పక్కనబెడితే రాజకీయాల్లో అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరాడు నాగబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచిన ప్రజారాజ్యం, అనేక కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది...

ఆ తర్వాత తమ్ముడు జనసేన పార్టీలో చేరిన నాగబాబు, పవన్ కళ్యాణ్‌ తరుపున అనేక ప్రెస్ మీటింగుల్లోనూ పాల్గొన్నారు. ‘ప్రజారాజ్యం’ 18 సీట్లు అయినా గెలిస్తే, ‘జనసేన’ ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచి, దారుణ ఓటమిని చవిచూసింది..

‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కి సపోర్ట్ చేసిన నాగబాబు, ఆయన కోసం కొన్ని మీడియా సమావేశాలు, సోషల్ మీడియాలో వీడియోలు కూడా విడుదల చేసి ప్రచారం చేశారు. కానీ ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ఓడిపోయింది.

‘జబర్ధస్త్’ నుంచి వచ్చి ‘అదిరింది’ అంటూ ఓ షో మొదలెట్టారు నాగబాబు. అది కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో కొన్నిరోజులకే ఆగిపోయింది. దీంతో నాగబాబు ఎక్కడ కాలు పెడితే, అక్కడ ఓటమి తప్పదని, ఆయన రావడం వల్లే టీమిండియా మ్యాచ్ ఓడిపోయిందని తలా, తోకా లేని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..

పక్కా ప్రణాళికతో భారత బౌలర్లను ఎదుర్కోవడంపై చాలా గ్రౌండ్ వర్క్ చేసిన పాక్ అద్భుత ఆటతీరు వల్ల భారత జట్టు ఓడిపోయింది.

ప్రతీ ఆటలోనూ గెలుపు, ఓటములు సహజం. అయితే దాన్ని అంగీకరించే మానసిక పరిపక్వత లేని నెటిజన్లు మాత్రం తమ ఆగ్రహాన్ని చూపించేందుకు క్రికెటర్లను, సెలబ్రేటీలను వెతుక్కుంటున్నారు...

Latest Videos

click me!