India vs Pakistan: వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. భారత్-పాక్ మ్యాచ్ పై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ

First Published Oct 19, 2021, 10:01 PM IST

ICC T20 World cup: మరో రెండ్రోజుల్లో భారత్-పాక్ మ్యాచ్ జరుగనుండగా తాజాగా ఈ మ్యాచ్ ను రద్దు చేయాలని సామాజిక మాధ్యమాలతో పాటు  రాజకీయ నాయకులు  కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. 

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 24న భారత్-పాక్ మ్యాచ్ జరుగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు దేశాల ఫ్యాన్స్ తో పాటు  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే  ఈ హైఓల్టేజీ మ్యాచ్ ను ఇష్టపడేవారితో పాటు వ్యతిరేకించే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా భారత్ లో సామాజిక మాధ్యమాలతో పాటు  కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ను రద్దు చేయాలని కోరారు. 

ఇదే విషయం ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతోంది.  రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్ ను రద్దు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

ట్విట్టర్ లో #Banpakcricket హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ కూడా మ్యాచ్ రద్దు చేయాలని కోరే వారికి మద్దతు పలికారు. 

తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ మ్యాచ్ పై స్పందించారు. బోర్డర్ లో భారత సైనికులు చచ్చిపోతుంటే పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటం అవసరమా..? అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. 

కాగా, దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఇదే విషయమై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రసంస్థలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఐసీసీకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం.. ఏదైనా జట్టుతో మేము ఆడమని తిరస్కరించే వీలులేదు. ఐసీసీ టోర్నీలో ఒకసారి కమిట్ అయ్యాక తప్పకుండా ఆడాల్సిందే.. అని స్పష్టం చేశారు. కశ్మీర్ లో ఉగ్రవాదుల చర్యలను ఖండించిన ఆయన.. ఐసీసీకి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేమని చెప్పారు. 

click me!