టీమిండియా రాత మార్చేది అతనే, వచ్చే వరల్డ్‌ కప్‌లో అయినా ఆడించండి... దినేశ్ కార్తీక్ కామెంట్...

First Published Nov 22, 2021, 5:25 PM IST

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో చోటు దక్కలేకపోయిన ఓ ప్లేయర్, వచ్చే ఏడాది టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషిస్తాడని అంటున్నాడు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్. అతను మరెవరో కాదు, స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్...

టీమిండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ, కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరగగా, వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచ కప్ జరగనుంది...

టీ20ల్లో భారత జట్టుకి ప్రధాన స్పిన్నర్‌గా సేవలు అందిస్తున్న యజ్వేంద్ర చాహాల్‌కి, పొట్టి ప్రపంచ కప్ టీమ్‌లో చోటు దక్కకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి స్థానంలో యజ్వేంద్ర చాహాల్‌ని ఆడించి ఉంటే, ఫలితం వేరేగా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అభిప్రాయపడ్డారు...

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా మొదటి రెండు మ్యాచుల్లో అవకాశం దక్కించుకోలేకపోయిన యజ్వేంద్ర చాహాల్, మూడో టీ20లో జట్టులోకి వచ్చాడు...

తాను వేసిన మొదటి ఓవర్‌లో 7 పరుగులిచ్చిన యజ్వేంద్ర చాహాల్, రెండో ఓవర్‌లో ఏకంగా 16 పరుగులు సమర్పించాడు. అయితే ఆ తర్వాతి ఓవర్‌లో హాఫ్ సెంచరీ చేసి, ఒంటరి పోరాటం చేస్తున్న మార్టిన్ గప్టిల్‌ను పెవిలియన్ చేర్చాడు చాహాల్...

మొదటి రెండు ఓవర్లలో 23 పరుగులిచ్చిన యజ్వేంద్ర చాహాల్, ఆ తర్వాత రెండు ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి గేమ్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు..

‘యజ్వేంద్ర చాహాల్‌ను తిరిగి టీ20 టీమ్‌లో చూడడం చాలా సంతోషాన్నిచ్చింది. అతని టాలెంట్ ఏంటో ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ చూపించాడు. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో చాహాల్ వేసిన బౌలింగ్‌, అతన్ని రియల్ ఛాంపియన్‌ని చేసింది...

ప్రస్తుతం టీమిండియాలో టాప్ లెగ్ స్పిన్నర్ చాహాల్.. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఓ చెస్ ప్లేయర్‌గా, ప్రత్యర్థి ఎత్తులను ముందుగానే అంచనా వేయడంలో చాహాల్ ఎప్పుడూ ముందుంటాడు...

అతను నా దృష్టిలో యజ్వేంద్ర చాహాల్ అసలైన హీరో. తన టాలెంట్‌ను సరిగా ఉపయోగించడం తెలిసిన ఓ ధైర్యమైన బౌలర్. 2013 ఐపీఎల్‌లో కేవలం రూ.10 లక్షలకు యజ్వేంద్ర చాహాల్‌ను కొనుగోలు చేసింది ఆర్‌సీబీ..

ఇప్పుడు అతని విలువ కోట్లకు పెరిగింది. నాకు తెలిసి, ఈ సారి ఆర్‌సీబీ, యజ్వేంద్ర చాహాల్‌ను రిటైన్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న స్పిన్నర్లలో చాహాల్‌ సత్తా ఏంటో కోహ్లీకి బాగా తెలుసు...

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఫ్లైట్ ఎక్కే భారత జట్టులో యజ్వేంద్ర చాహాల్ తప్పకుండా ఉంటాడు. ఎందుకంటే రోహిత్ శర్మ, చాహాల్‌ను బాగా నమ్ముతాడు...

యజ్వేంద్ర చాహాల్‌కి, రోహిత్ శర్మకి మధ్య మంచి అనుబంధం ఉంది... అది టీమిండియా తలరాతను మార్చేస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్..

యూఏఈలో జరిగిన ఐపీఎల్ సెకండాఫ్‌లో 8 మ్యాచులు ఆడిన యజ్వేంద్ర చాహాల్, 14 వికెట్లు పడగొట్టాడు. భారత్‌లో 8.26 ఎకానమీతో బౌలింగ్ వేసిన చాహాల్, యూఏఈలో 7.06 ఎకానమీతో ఆకట్టుకున్నాడు...

click me!