వెంకటేశ్ అయ్యర్ అదరగొట్టినా హార్ధిక్ పాండ్యానే కావాలి... సౌతాఫ్రికా టూర్‌కి ముందు...

First Published Nov 22, 2021, 3:11 PM IST

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో యజ్వేంద్ర చాహాల్ పేరు లేకపోవడం ఎంతటి చర్చనీయాంశమైందో, హార్ధిక్ పాండ్యా పేరు ఉండడం కూడా అంతే హాట్ టాపిక్ అయ్యింది. పొట్టి ప్రపంచకప్‌లో హార్ధిక్ పాండ్యా, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో మెరుపులు మెరిపించడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో హార్ధిక్ పాండ్యా పేరు కనిపించలేదు. బిజీ షెడ్యూల్ కారణంగా విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లకు విశ్రాంతి నిచ్చిన సెలక్టర్లు, పెద్దగా క్రికెట్ ఆడని పాండ్యాని పక్కనబెట్టారు...

పొట్టి ప్రపంచ కప్‌లో పెద్దగా చెప్పుకోదగిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోవడం, గత రెండేళ్లుగా బౌలింగ్‌లో వికెట్లు తీయలేకపోతుండడంతో హార్ధిక్ పాండ్యాని టీమ్ నుంచి తప్పించారని టాక్...

అయితే వచ్చే నెలలో జరిగే సౌతాఫ్రికా సిరీస్‌లో హార్ధిక్ పాండ్యాకి చోటు కల్పించాలని టీమిండియా, మేనేజ్‌మెంట్, సెలక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం...

టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత కొన్నాళ్లు దుబాయ్‌లో రిలాక్స్ అయి, స్వదేశానికి చేరుకున్న హార్ధిక్ పాండ్యా... ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు...

డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టూర్‌లో హార్ధిక్ పాండ్యా అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్న సెలక్టర్లు, అతన్ని ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించారు...

న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ ముగిసే సమయానికి సౌతాఫ్రికా టూర్‌లో పర్యటించే భారత జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. ఈలోపు జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంటుంది హార్ధిక్ పాండ్యా...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకి బాల్‌తో, బ్యాటుతో ఎన్నో విజయాలు అందించిన హార్ధిక్ పాండ్యాను తన కెప్టెన్సీలో టీమిండియా తరుపున ఎలాగైనా ఆడించాలని టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడట. 

హార్ధిక్ పాండ్యాతో పాటు వెంకటేశ్ అయ్యర్‌‌కి దక్షిణాఫ్రికా టూర్‌లో మరో అవకాశం దక్కొచ్చని సమచారం... మొదటి రెండు మ్యాచుల్లో మెరుపులు మెరిపించలేకపోయిన వెంకటేశ్ అయ్యర్, మూడో టీ20లో బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు...

బ్యాటింగ్‌లో 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, ఆడమ్ మిల్నే వికెట్ తీసి అంతర్జాతీయ కెరీర్‌లో మొట్టమొదటి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు...

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా, భారత సారథి విరాట్ కోహ్లీ వంటి సీనియర్లకు కూడా సౌతాఫ్రికా టూర్‌లో టీ20 టీమ్‌లో చోటు కల్పించాలని భావిస్తోంది టీమిండియా...

ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రోహిత్ శర్మ బ్యాట్స్‌మెన్‌గా రాణించగా, సౌతాఫ్రికా టూర్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసే అవకాశం అభిమానులకు దక్కనుందని సమాచారం...

click me!