ధోనీ ఆపేశాడు, రాహుల్ ద్రావిడ్ మళ్లీ మొదలెట్టాడు... అజిత్ అగార్కర్ నుంచి హర్షల్ పటేల్...

First Published | Nov 19, 2021, 8:08 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. ఆరంగ్రేటం మ్యాచ్ నుంచే భారత జట్టుపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశాడు ద్రావిడ్...

జూన్ నెలలో శ్రీలంక టూర్‌లో భారత జట్టుకి తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు రాహుల్ ద్రావిడ్. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లతో నిండిన జట్టుకు మార్గనిర్దేశకుడిగా బాధ్యతలు చేపట్టాడు...

శ్రీలంక టూర్‌లో దాదాపు ఎంపికైన క్రికెటర్లు అందరికీ అవకాశం దక్కింది. ఐపీఎల్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్‌తో పాటు చేతన్ సకారియా, సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ రాణా వంటి యంగ్ ప్లేయర్లు అందరూ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు..

Latest Videos


టీమ్‌కి ఎంపికైన అందరికీ అవకాశం ఇవ్వడమే తన లక్ష్యమంటూ టూర్ ఆరంభానికి ముందే చెప్పిన రాహుల్ ద్రావిడ్‌కి లంక టూర్‌లో ఎదురైన పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి...

కృనాల్ పాండ్యా కరోనా బారిన పడడం, అతనితో క్లోజ్ కాంట్రాక్ట్ ఉన్న ఎనిమిది మంది ప్లేయర్లు జట్టుకి దూరం కావడంతో రిజర్వు బెంచ్‌లో ఉన్న ప్లేయర్లందరినీ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది...

తాజాగా పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు అందుకున్న రాహుల్ ద్రావిడ్, న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి రెండు టీ20 మ్యాచుల్లో ఇద్దరు ప్లేయర్లను ఆరంగ్రేటం చేయించాడు...

జైపూర్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ద్వారా కేకేఆర్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఆరంగ్రేటం చేయగా, మహ్మద్ సిరాజ్ గాయపడడంతో అతని స్థానంలో హర్షల్ పటేల్‌కి రెండో టీ20 మ్యాచ్‌లో అవకాశం దక్కింది...

రాంఛీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన హర్షల్ పటేల్‌కి, భారత మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్, టీమిండియా క్యాప్‌ను అందించాడు...

సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కూడా ఎవరైనా కొత్త ప్లేయర్ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తే, వారికి మాజీ క్రికెటర్ల నుంచి క్యాప్ అందచేయించడం లాంఛనంగా ఉండేది...

అయితే ఎమ్మెస్ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సంస్కృతికి ఫుల్‌స్టాప్ పడింది. ధోనీ తర్వాత కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ కూడా మాజీ క్రికెటర్లకు బదులుగా కోచ్, కెప్టెన్, మిగిలిన ప్లేయర్లతో క్యాప్ అందించడం చేసేవాళ్లు...

రెండో టీ20 మ్యాచ్ ద్వారా టీమిండియా మరిచిపోయిన పాత సంస్కృతిని రాహుల్ ద్రావిడ్ తిరిగి ప్రారంభించాడని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పష్టం చేశారు...

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికైన వారిలో ముగ్గురు కొత్త కుర్రాళ్లు ఉండగా, మొదటి రెండు మ్యాచుల్లో ఇద్దరు ప్లేయర్లు ఆరంగ్రేటం చేయగా, ఆవేశ్ ఖాన్‌కి ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదు...

ఇంగ్లాండ్ టూర్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక కావడంతో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఆరంగ్రేటం చేసే అవకాశాన్ని కోల్పోయిన ఆవేశ్ ఖాన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.

click me!