ఎవరీ హర్షల్ పటేల్... ఐపీఎల్‌ 2021 పర్పుల్ క్యాప్ విన్నర్, ఆ మ్యాచుల్లో ఓపెనర్, కెప్టెన్...

First Published Nov 19, 2021, 7:30 PM IST

ఇండియా, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్‌ ద్వారా హర్షల్ పటేల్, అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. మొదటి టీ20 మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తూ గాయపడడంతో అతని స్థానంలో హర్షల్ పటేల్‌కి తుది జట్టులో చోటు దక్కింది...

జైపూర్‌లో మొదటి టీ20 మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్, ఆరంగ్రేటం చేయగా, రాంఛీలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ ద్వారా హర్షల్ పటేల్, అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు..

ఐపీఎల్ 2021 సీజన్‌లో మెరుపులా వెలుగులోకి వచ్చిన ప్లేయర్లలో హర్షల్ పటేల్ ఒకడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన హర్షల్ పటేల్, సీజన్‌లో 32 వికెట్లు తీసి, ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు...

2012 నుంచి 2017 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడిగా ఉన్న హర్షల్ పటేల్, 2015 సీజన్‌లో 17 వికెట్లు తీసి ఆకట్టుకునే పర్పామెన్స్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాతి సీజన్‌లో ఐదు మ్యాచులు ఆడినా ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు...

ఆర్‌సీబీలో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయిన హర్షల్ పటేల్‌ని,  2018 ఐపీఎల్ వేలంలో రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే మూడు సీజన్లలో కలిపి 12 మ్యాచుల్లో 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు హర్షల్ పటేల్. 

2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆర్‌సీబీలోకి వచ్చిన హర్షల్ పటేల్, అదిరిపోయే పర్ఫామెన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. 8.14 ఎకానమీతో 32 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు...

గుజరాత్‌లో జన్మించిన హర్షల్ పటేల్, 2009 అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీలో 23 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వాస్తవానికి హర్షల్ పటేల్ కుటుంబం, యూఎస్‌ఏకి వెళ్లి, అక్కడే సెటిల్ అవ్వాలని అనుకున్నారు...

Harshal Patel

అయితే హర్షల్ పటేల్ అన్న తపన్ పటేల్, తమ్ముడి క్రికెట్ కెరీర్‌ కోసం ఆ ఆలోచనను విరమించుకున్నాడు. 2010 అండర్-19 వరల్డ్‌కప్ ఆడిన హర్షల్ పటేల్. ముంబై ఇండియన్స్‌ జట్టుతో కాంట్రాక్ట్ పొందాడు.

గుజరాత్ సెలక్టర్లు, హర్షల్ పటేల్‌ను పట్టించుకోకపోవడంతో హర్యానాకి మారాడు. ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన హర్షల్ పటేల్, రాజస్థాన్‌పై కేవలం 34 పరుగులకే 8 వికెట్లు తీశాడు...

దేశవాళీ క్రికెట్‌లో హర్యానా జట్టుకి ఓపెనర్‌గా వ్యవహరించే హర్షల్ పటేల్, 96 టీ20 మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో 787 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 98 వికెట్లు తీశాడు...

ముంబై ఇండియన్స్‌ జట్టుపై ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన హర్షల్ పటేల్, సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో జడేజాకి 37 పరుగులు సమర్పించాడు...

ఐపీఎల్‌ 2021లో హ్యాట్రిక్ తీసిన హర్షల్ పటేల్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, రాహుల్ చాహార్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి నెట్ బౌలర్‌గా ఎంపికైన హర్షల్ పటేల్, 31 ఏళ్ల వయసులో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేశాడు. 

click me!