టెస్టులకు శ్రేయాస్ అయ్యర్, వన్డే, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్... రెండు ఫార్మాట్లకు రెండు వేర్వేరు జట్లను...

First Published Nov 18, 2021, 9:42 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా, కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా చేరుకోలేకపోయింది. దీనికి ప్రధానంగా వినిపించిన కారణం బిజీ షెడ్యూల్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్, ఐపీఎల్ సెకండ్ ఫేజ్ అంటూ తీరిక లేని క్రికెట్ ఆడిన తర్వాత టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అడుగుపెట్టింది భారత జట్టు...

ఫైనల్ చేరిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు పెద్దగా క్రికెట్ ఆడింది లేదు. ప్లేఆఫ్స్ చేరిన ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు కూడా పొట్టి ప్రపంచకప్‌కి కూడా చాలా విశ్రాంతి తీసుకున్నారు...

ఇంగ్లాండ్‌, టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడినప్పటికీ... ఆ టెస్టు టీమ్, టీ20 టీమ్ ఒకటి కాదు. టెస్టుల్లో ఉన్న డేవిడ్ మలాన్, బెయిర్ స్టో, అదిల్ రషీద్, మొయిన్ ఆలీ వంటి కొందరు ప్లేయర్లు మినహా మిగిలిన ఎవ్వరూ టీ20ల్లో కనిపించరు...

టీమిండియా పరిస్థితి అలా కాదు. టెస్టుల్లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే, టీ20ల్లో కూడా వారే ఓపెనింగ్ చేయాల్సిన పరిస్థితి. బౌలర్లు కూడా దాదాపు సేమ్...

టెస్టుల్లో ఓపెనర్‌గా నిలదొక్కుకున్నట్టు కనిపించిన శుబ్‌మన్ గిల్ గాయపడడంతో అతని స్థానంలో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్... ప్రధాన ఓపెనర్‌గా ఫిక్స్ అయిపోయాడు... 

కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలతో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్, పేస్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ... మూడుకి మూడు ఫార్మాట్లలోనూ ఆడాల్సిన పరిస్థితి...

ఇదే టీమిండియా ప్రదర్శనపై తీవ్రంగా ప్రభావం చూపింది. టీ20 వరల్డ్‌కప్ 2021 పరాభవంతో టీమిండియాలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తోందట బీసీసీఐ...

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లలా టెస్టులకు వేరుగా, వన్డే, టీ20 ఫార్మాట్లకు వేరుగా టీమ్‌లను తయారుచేయాలని భావిస్తోందట. ఐపీఎల్ కారణంగా భారత జట్టులో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్ల సంఖ్య భారీగా పెరిగింది...

దాదాపు 40 నుంచి 50 మంది ప్లేయర్లతో భారత జట్టు రిజర్వు బెంచ్ కళకళలాడుతోంది. దీన్ని సరిగ్గా వాడుకుని పరిమిత ఓవర్ల క్రికెట్‌కి సెపరేట్‌గా, టెస్టులకు సెపరేట్‌గా జట్లను తయారుచేయాలని చూస్తోంది బీసీసీఐ...

సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ తర్వాత అప్పటిదాకా నాలుగో స్థానంలో రాణించిన శ్రేయాస్ అయ్యర్‌కి టీ20ల్లో చోటు దక్కడమే గగనంగా మారింది. న్యూజిలాండ్ సిరీస్‌లో అతనికి అవకాశం దక్కినా, విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తే... టీ20ల్లో అతనికి ప్లేస్ దక్కడం అనుమానమే...

టీ20 ఫార్మాట్‌కి సరిగా సూట్ అయిన సూర్యకుమార్ యాదవ్‌ను పొట్టి ఫార్మాట్‌కి ఫిక్స్ చేసి, నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా నిలదొక్కుకుపోయే శ్రేయాస్ అయ్యర్‌ని టెస్టుల్లో వాడుకోవాలని భావిస్తోంది బీసీసీఐ...

అలాగే మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ వంటి పేసర్లు టెస్టుల్లో బాగా రాణిస్తున్నారు. వీరికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్ వంటి యువ పేసర్లను రాటు తేలేలా చేసి, టెస్టులకు సిద్ధంగా ఉంచాలని భావిస్తోంది...

టీ20ల్లో కీలకంగా మారిన పేసర్లను తయారుచేసేందుకు వీలుగా ఎన్‌సీఏ కొత్త బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీ ఆధ్వరంలో ‘పేసర్స్ కాంట్రాక్ట్’ అనే పద్ధతిని తీసుకురాబోతున్నారు...

ఈ కాంట్రాక్ట్‌లో యువ పేసర్లను గుర్తించి, వాళ్లు 30 ఏళ్లు వచ్చే వరకూ సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించేలా రాటుతేల్చబోతున్నారు. టెస్టు ఫార్మాట్‌లో సుదీర్ఘ స్పెల్స్ వేసేందుకు వీలుగా వీరిని ఫిట్‌గా తయారుచేయబోతున్నారు...

టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత భారత జట్టు వన్డే, టీ20 మ్యాచులు ఆడాల్సి వచ్చినా ఆ ప్రభావం... తర్వాతి మ్యాచ్‌లపై పడకుండా రెండు వేర్వేరు జట్లను రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు కోచ్ రాహుల్ ద్రావిడ్ అండ్ కో...

click me!