ఈ మాత్రం దానికి వెంకటేశ్ అయ్యర్ దేనికి...బౌలింగ్ చేయించకుండా, సరిగా బ్యాటింగ్‌ చేయనివ్వకుండా...

First Published Nov 17, 2021, 11:17 PM IST

టీమిండియాను ఎప్పటి నుంచే వేధిస్తున్న సమస్య సరైన ఆల్‌రౌండర్లు లేకపోవడం. వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఆల్‌రౌండర్లతో నిండి ఉంటే, టీమిండియాలో మాత్రం ఒకరు, లేదా ఇద్దరు ఆల్‌రౌండర్లకే చోటు దక్కుతోంది...

ఇన్నాళ్లుగా టీమిండియాకి పేస్ ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా, రెండేళ్లుగా వెన్ను గాయం కారణంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. దాంతో అతని స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌కి తుది జట్టులో చోటు కల్పించింది టీమిండియా...

ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్‌లో కేకేఆర్‌కి ఓపెనర్‌గా అద్భుతంగా రాణించిన వెంకటేశ్ అయ్యర్, 140+ కి.మీ. వేగంతో బంతులు విసిరి, పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు...

అలాంటి ప్లేయర్‌కి న్యూజిలాండ్‌తో సిరీస్‌లో చోటు దక్కడంతో టీమిండియా రాత మారుతుందని భావించారంతా. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లలా ఆల్‌రౌండర్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకుంటారని భావించారు క్రికెట్ ఫ్యాన్స్...

అయితే అలా జరగలేదు. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో బరిలో దిగిన భారత జట్టు... ఆల్‌రౌండర్‌ను కేవలం ఫీల్డింగ్‌కి తప్ప... బౌలింగ్‌కి, బ్యాటింగ్‌కి పెద్దగా వాడింది లేదు...

పేసర్ దీపక్ చాహార్, మహ్మద్ సిరాజ్ భారీగా పరుగులు సమర్పిస్తున్నా, వెంకటేశ్ అయ్యర్‌తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు కెప్టెన్ రోహిత్ శర్మ...

ఓపెనర్‌గా రాణిస్తున్న వెంకటేశ్ అయ్యర్‌ను రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయిస్తే... లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా వర్కవుట్ అవుతుందని భావించారు క్రికెట్ విశ్లేషకులు...

అయితే అయ్యర్‌ని ఓపెనర్‌గా కాదు కదా వన్‌డౌన్, టూ డౌన్, త్రీ డౌన్‌లో కూడా బ్యాటింగ్‌కి పంపించలేదు భారత జట్టు. హార్ధిక్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌ను అదే స్థానంలో వాడాలని ఫిక్స్ అయినట్టు, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి పంపారు...

బెన్ స్టోక్స్, సునీల్ నరైన్ వంటి టాప్ క్లాస్ ఆల్‌రౌండర్లను చూసి, మన జట్టులో అలాంటి ఆల్‌రౌండర్లు లేరని తెగ ఫీలైపోతుంటారు భారత అభిమానులు. అయితే బెన్ స్టోక్స్‌లా రాణించే ఆల్‌రౌండర్లు దొరికినప్పుడు, వారిని చక్కగా వాడుకోవడం కూడా తెలియగలగాలి. 

ఆల్‌రౌండర్లు దొరికినప్పుడు వారిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేసి టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయించాలి... అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్ చేయగలగడంపై వారికి అనుభవం పెరుగుతుంది.

భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఓపెనర్‌గా, వన్‌డౌన్ ప్లేయర్‌గా వచ్చి బ్యాటింగ్ చేశాడు, పరుగులు చేశాడు. ఓ పేసర్‌గా వచ్చిన ఇర్ఫాన్, ఆ తర్వాత పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా రూపాంతరం చెందేందుకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందాడు. 

టీమిండియాకి ఇప్పుడు అలా ఏ పొజిషన్‌లో అయినా బ్యాటింగ్ చేయగల ప్లేయర్ కావాలి. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయగల ప్లేయర్‌ని ఓపెనర్‌గా ఆడించడం మంచి మూవ్ అవుతుంది కానీ ఓపెనర్‌గా అదరగొట్టే ప్లేయర్‌ని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి పంపించడం ఏ రకంగానూ కరెక్ట్ కాదు, కాబోదు.  

అలాగే బౌలింగ్ వేయించనప్పుడు, ఆల్‌రౌండర్‌గా ఓ ప్లేయర్‌కి చోటు ఇవ్వడం దేనికి? మ్యాచ్ ఫినిషర్ కావాలంటే ఆ రోల్‌ పోషించడానికి టీమిండియాలో చాలా మంది ఉన్నారు. సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప, దినేశ్ కార్తీక్‌లకు మంచి ఫినిషర్లుగా హార్ధిక్ పాండ్యా కంటే మెరుగైన రికార్డులు కూడా ఉన్నాయి..

ఎలాంటి పరిస్థితుల్లో అయినా రాణించి, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు గెలవడానికి జట్టుకి సరైన ఆల్‌రౌండర్లు కావాలి. వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆల్‌రౌండర్ దొరికినప్పుడు సరిగా వాడుకోవడం తెలియాలని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు..

click me!