వస్తున్నా! వచ్చేస్తున్నా... టెస్టుల్లోనూ ఎంట్రీ ఇస్తానంటున్న సూర్యకుమార్ యాదవ్..

First Published Nov 21, 2022, 12:47 PM IST

2021 మార్చిలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్... కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న, ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తూ వస్తున్నా సూర్యని పట్టించుకోని సెలక్టర్లు, ఎన్నో విమర్శల తర్వాత ఎట్టకేలకు 2021లో టీమిండియాలోకి తీసుకున్నారు. ఏడాదిలో 41 మ్యాచులు ఆడి 45 సగటుతో 1395 పరుగులు చేశాడు సూర్య...

Suryakumar Yadav

ఈ ఏడాది టీ20ల్లో 1000+ పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సెంచరీ బాదాడు. ఈ ఏడాది సూర్యకి ఇది రెండో టీ20 సెంచరీ...

Suryakumar Yadav

వన్డేల్లో, టీ20ల్లో రాణిస్తున్నా ఇప్పటిదాకా సూర్యకుమార్ యాదవ్‌కి టెస్టు ఆరంగ్రేటం చేసే అవకాశం మాత్రం దక్కలేదు. టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా టాప్‌లో కొనసాగుతున్నా... టెస్టుల్లోకి రావాలని ఎంతగానో ఆశపడుతున్నాడు సూర్యకుమార్ యాదవ్...

Suryakumar Yadav

రెండో టీ20 మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ ఫెయిల్ అయినా సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగి టీమిండియాకి 191 పరుగుల భారీ స్కోరు అందించాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు సూర్య...

‘టెస్టు సెలక్షన్ కూడా త్వరలోనే వచ్చేస్తుంది. క్రికెట్ ఆడడం మొదలెట్టినప్పుడే రెడ్ బాల్‌తో ఆడడం ప్రారంభిస్తాం. ముంబై టీమ్ తరుపున ఎన్నో ఏళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నా. టెస్టు ఫార్మాట్ అంటే నాకెంతో ఇష్టం. టెస్టుల్లో ఆడాలని ఎంతగానో ఆశపడుతున్నా. త్వరలోనే టెస్టు క్యాప్ అందుకుంటానని అనుకుంటున్నా...’ అంటూ వ్యాఖ్యానించాడు సూర్యకుమార్ యాదవ్..

77 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 44.01 సగటుతో 5326 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సూర్య అత్యధిక స్కోరు 200 పరుగులు...

2021 ఇంగ్లాండ్ టూర్‌లో మయాంక్ అగర్వాల్, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా ఫెయిల్ అవుతూ ఉండడంతో సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించాలని భావించాడు అప్పటి సారథి విరాట్ కోహ్లీ... శ్రీలంక టూర్ ముగించుకున్న సూర్య, పృథ్వీ షా... ఇంగ్లాండ్‌కి చేరుకుని భారత జట్టులో కలిసారు కూడా...

అయితే లంక టూర్‌లో భారత జట్టులో కరోనా కేసులు వెలుగుచూడడం, పృథ్వీ షాకి కూడా కోవిడ్ పాజిటివ్ రావడంతో ఈ ఇద్దరూ వారానికి పైగా క్వారంటైన్‌లో గడపాల్సి వచ్చింది. ఈ కారణంగా నాలుగో టెస్టులో ఆడలేకపోయిన సూర్య, మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు ఆడాల్సింది. 

అయితే నాలుగో టెస్టులో సమయంలో భారత బృందంలోని హెడ్ కోచ్ రవిశాస్త్రితో సహా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అండ్ కో కరోనా పాజిటివ్‌గా తేలడంతో మాంచెస్టర్ టెస్టు అర్ధాంతరంగా రద్దయ్యింది. దీంతో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా.. టెస్టు మ్యాచులు ఆడకుండానే ఐపీఎల్‌ కోసం యూఏఈ వెళ్లారు.. 

click me!