Ind Vs Nz: అప్పడే నా పనైపోయింది అనుకున్నా.. కానీ అతడి వల్లే ఇక్కడున్నా : శ్రేయస్ అయ్యర్

First Published Nov 27, 2021, 12:48 PM IST

India Vs New Zealand Test: ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న కాన్పూర్ టెస్టులో  సెంచరీ చేసిన  శ్రేయస్ అయ్యర్.. తన మాజీ కెప్టెన్, ప్రస్తుతం టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తో పాటు కాన్పూర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. 

అరంగ్రేట టెస్టులోనే సెంచరీ సాధించిన టీమిండియా యువ  బ్యాటర్ శ్రేయస్ అయ్యర్  ఆ ఘనత సాధించిన దిగ్గజాల సరసన నిలిచాడు. భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ గైర్హాజీరీ లో టెస్టుల్లో  రాకరాక వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. 

అయితే సెంచరీ తర్వాత అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  తనకు కాన్పూర్ తో విడదీయరాని అనుబంధం  ఉందని  చెప్పిన  అయ్యర్.. తన కెరీర్ కు సూర్యకుమార్ యాదవ్ ఎంతో సహకరించాడని  తెలిపాడు. 

రెండో రోజు ఆట అనంతరం సూర్యకుమార్ యాదవ్.. శ్రేయస్ ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. బీసీసీఐ ఈ వీడియోను అప్లోడ్ చేసింది.   ఈ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ.. ‘భారత్ తరఫున టెస్టుల్లో  ఆడాలనేది నా కల. కానీ విధి మరోలా తలచింది. కాన్పూర్ టెస్టుకు  ముందువరకు నాకు వన్డేలు, టీ20లలో ఆడటానికే అవకాశం దక్కింది. 

కానీ అనూహ్యంగా కాన్పూర్ లో తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది.  అయితే తొలి టెస్టులోనే సెంచరీ చేయడం కంటే ఆనందం ఇంకేముంటుంది. ఇంతకంటే గొప్ప ఆరంభాన్ని నేను కోరుకోలేనేమో.. 

కాన్పూర్ స్టేడియం నిజంగా నాకు అదృష్టం వంటిది. నా రంజీ అరంగ్రేటం ఇక్కడే జరిగింది. ఇప్పుడు  జాతీయ జట్టు తరఫున కూడా ఇదే గ్రౌండ్ లో ఎంట్రీ  ఇచ్చా. రెండు సందర్భాల్లోనూ జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరుగులు సాధించా. 

రంజీ లో (మహారాష్ట్ర తరఫున) నేను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే అరంగ్రేటం చేశా. వరుసగా  నాలుగు ఇన్నింగ్స్ లలో విఫలమైన తర్వాత నాకు జట్టులో చోటు దక్కదేమో అని భావించా. కానీ సూర్యకుమార్ నాకు మద్దతుగా నిలిచాడు. నేను అతడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

నా తొలి రంజీ  మ్యాచ్ సమయంలో కూడా మా జట్టు (మహారాష్ట్ర) కష్టాల్లో ఉంది. అప్పుడు మేం 30 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో నేను  బ్యాటింగ్ కు దిగి 150 పరుగులు చేశా. ఇప్పుడు  న్యూజిలాండ్ తో టెస్టులో కూడా ఇండియా కష్టాల్లో (120కే  మూడు వికెట్లు) ఉన్నప్పుడు సెంచరీ చేయడం ఆనందాన్నిచ్చింది..’ అని తెలిపాడు. 

విరాట్ కోహ్లీ  గైర్హాజరీతో అయ్యర్ కు టెస్టుల్లో చోటు దక్కగా.. కెఎల్ రాహుల్ గాయపడటంతో సూర్యకుమార్ కూడా జట్టుకు ఎంపికయ్యాడు. కానీ తుది జట్టుకు మాత్రం అయ్యర్ నే ఎంపిక చేయడంతో సూర్య బెంచ్ కే పరిమితమయ్యాడు.

click me!