ఇదేం అంపైరింగ్ భయ్యా... అంపైర్‌తో ఆ విషయంలో గొడవపడ్డ రవిచంద్రన్ అశ్విన్...

First Published Nov 27, 2021, 12:27 PM IST

కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు నీరసంగా సాగుతోంది. కివీస్ బ్యాట్స్‌మెన్ జిడ్డు బ్యాటింగ్‌తో పాటు అంపైర్ల తప్పుడు నిర్ణయాలు, బౌలర్లకు ఏ మాత్రం సహకరించని పిచ్ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 197 పరుగులు చేసింది...

తొలి వికెట్‌ కోసం భారత బౌలర్లు 66.1 ఓవర్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. మొదటి వికెట్‌కి 151 పరుగులు జోడించిన తర్వాత విల్ యంగ్ అవుట్ అయ్యాడు.

 214 బంతుల్లో 15 ఫోర్లతో 89 పరుగులు చేసిన విల్ యంగ్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత టామ్ లాథమ్‌తో కలిసి రెండో వికెట్‌కి 46 పరుగులు జోడించాడు కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్. 64 బంతుల్లో 4 ఫోర్లతో 18 పరుగులు చేసిన కేన్ విలియంసన్‌ని ఉమేశ్ యాదవ్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు...

స్వదేశంలో 97 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, 2017 నుంచి నాలుగేళ్లలో 64 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు. ఇండియాలో ఈ నాలుగేళ్లలో ఇషాంత్ శర్మ 38, మహ్మద్ షమీ 33, భువీ 11 వికెట్లతో టాప్ 4లో ఉండడం విశేషం...

అయితే భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, బౌలింగ్‌ పొజిషన్ విషయంలో అంపైర్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నాన్‌ స్ట్రైయికర్ వికెట్ల వెనకాల ఉన్న అంపైర్ నితిన్ మీనన్‌, నాకు వికెట్లు కనిపించకుండా అడ్డుగా వస్తున్నావని అశ్విన్‌ని వారించాడు...

అయితే రవిచంద్రన్ అశ్విన్ మాత్రం తాను డేంజర్ ఏరియాలో బౌలింగ్ చేయడం లేదు కదా... అని సమాధానం ఇచ్చాడు. ఈ విషయంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానే, అశ్విన్ కూడా అంపైర్లతో చాలాసేపు మాట్లాడారు...

అంత చెప్పిన తర్వాత కూడా బౌలింగ్ యాక్షన్‌ని ఏ మాత్రం మార్చుకోని రవిచంద్రన్ అశ్విన్, మళ్లీ అలాగే అంపైర్‌, నాన్‌స్ట్రైయికర్ ముందుగా వచ్చి బౌలింగ్ చేయడం విశేషం...

అలాగే టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్, మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్‌తో ఈ విషయం గురించి చర్చించడం టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది...

కాన్పూర్ టెస్టులో రెండో రోజు అంపైర్లు ఇచ్చిన కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. టామ్ లాథమ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్, ఓ ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేశాడు. అయితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు...
 

అశ్విన్ డీఆర్‌ఎస్ తీసుకోవాలని భావించినా... మయాంక్ అగర్వాల్, అజింకా రహానే వద్దని వారించారు. అయితే టీవీ రిప్లైలో బంతి వికెట్లను మధ్యలో తాకుతున్నట్టుగా స్పష్టంగా కనిపించింది...

విల్ యంగ్ వికెట్‌తో ఈ ఏడాది 39 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు. పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీని అధిగమించి, 2021లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు అశ్విన్...

click me!