కెప్టెన్సీ ఇస్తే రోహిత్ శర్మ ఆటే వేరు... విరాట్ కోహ్లీ రికార్డులు బ్రేక్, ఎమ్మెస్ ధోనీ రికార్డు సమం...

First Published Nov 21, 2021, 9:37 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావించినా, టీ20 కెప్టెన్సీ కోసం విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు రోహిత్ శర్మ. టీ20 కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తనదైన ముద్ర వేశాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్... 

31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చసిన రోహిత్ శర్మ, టీ20ల్లో 26వ హాఫ్ సెంచరీ, 30వ 50+ స్కోరు నమోదుచేశాడు. రోహిత్‌కి టీ20ల్లో నాలుగు సెంచరీలు ఉన్న విషయం తెలిసిందే. 

టీ20 ఫార్మాట్‌లో అత్యధిక 50+ పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ (29 హాఫ్ సెంచరీలు) రికార్డును అధిగమించి, టాప్‌లోకి దూసుకెళ్లాడు రోహిత్ శర్మ...

నేటి మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాది, టీ20ల్లో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్ (161 సిక్సర్లు) తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు... క్రిస్ గేల్ 124 అంతర్జాతీయ టీ20 సిక్సర్లతో మూడో స్థానంలో నిలిచాడు..

ఈ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ 48 పరుగుల స్కోరుతో మొత్తంగా 159 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో రెండుసార్లు 150+ పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు...

ఇంతకుముందు 2017లో తాత్కాలిక కెప్టెన్‌గా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 162 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. కెప్టెన్‌గా కాకుండా బ్యాట్స్‌మెన్‌గా ఆడిన ఏ సిరీస్‌లోనూ రోహిత్ 150+ స్కోరు చేయకపోవడం విశేషం...

టీ20, వన్డే, టెస్టుల్లో కలిపి 124 సార్లు 50+ స్కోర్లు చేసిన రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ రికార్డును సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ 264 సార్లు, రాహుల్ ద్రావిడ్ 194, విరాట్ కోహ్లీ 188, సౌరవ్ గంగూలీ 145 సార్లు 50+ స్కోర్లు చేసి టాప్‌లో ఉన్నారు...

న్యూజిలాండ్‌పై రోహిత్ శర్మకు ఇది ఆరో హాఫ్ సెంచరీ. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ తర్వాతి స్థానంలో నిలిచాడు రోహిత్. ఆసీస్‌పై విరాట్ 7 సార్లు 50+ స్కోరు చేయగా, డేవిడ్ వార్నర్ శ్రీలంకపై ఆరుసార్లు ఈ ఫీట్ సాధించాడు...

న్యూజిలాండ్‌పై 25 సిక్సర్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, కివీస్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌పై 29 సిక్సర్లు బాదిన రోహిత్, బంగ్లాదేశ్‌పై 21 సిక్సర్లు బాదాడు...

కెప్టెన్‌గా 50 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పటిదాకా 22 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్, సారథిగా అత్యంత వేగంగా  50 సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు...

టెస్టుల్లో 50+ సిక్సర్లు, వన్డేల్లో 100+ సిక్సర్లు, టీ20ల్లో 150+ సిక్సర్లు బాదిన మొట్టమొదటి ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ... 

2019లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ విరాట్ కోహ్లీ టాస్ గెలవగా, ఆ తర్వాత సిరీస్‌లోని మూడు మ్యాచుల్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ... ధోనీ అండ్ కో, ఈ రికార్డు సాధించలేకపోయారు.

Latest Videos

click me!