
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి గ్రూప్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడనుంది. మార్చి 2, ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ ఏ లో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించడంతో ఈ మ్యాచ్ అంతంత మాత్రమే అయినప్పటికీ, గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు ఇరు జట్లు పోరాడనున్నాయి.
బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లపై వరుసగా రెండు విజయాలు సాధించి, ఈ రెండు జట్లు టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత్ -న్యూజిలాండ్ మ్యాచ్ లో చూడాల్సిన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శుభ్‌మన్ గిల్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌పై భారత్ ఆరు వికెట్ల విజయంలో టీం ఇండియా వైస్ కెప్టెన్ గిల్ 112 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేశాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై 52 బంతుల్లో 46 పరుగులు చేశాడు. కోహ్లీ కూడా సెంచరీ కొట్టాడు. దీంతో దుబాయ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాక్ పై విజయం సాధించింది. శుభ్‌మాన్ గిల్ ఫామ్, టాప్ ఆర్డర్‌లో ప్రదర్శన టీం ఇండియాకు చాలా సానుకూలంగా ఉంది. న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో కూడా గిల్ అదే జోరును కొనసాగిస్తారని భావిస్తున్నారు. గిల్ ఒక దూకుడు టాప్-ఆర్డర్ బ్యాటర్. గిల్ బ్యాట్ పనిచేస్తే న్యూజిలాండ్ కు కష్టాలు తప్పవు.
2. విలియం ఓ'రూర్కే
న్యూజిలాండ్ పేసర్ విలియం ఓ'రూర్కే భారత్-కీవీస్ మ్యాచ్ లో చూడాల్సిన మరో ప్లేయర్. 23 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ ప్రస్తుతం కివీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. 12.80 సగటుతో 5 వికెట్లు పడగొట్టి, రెండు మ్యాచ్‌ల్లో 20 ఓవర్లలో 95 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన కనిపించింది. 9 ఓవర్లలో 5.22 ఎకానమీ రేటుతో 3/47 పరుగులు ఇచ్చాడు. ఓ'రూర్కే తన అద్భుతమైన బౌలింగ్ తో బంగ్లాదేశ్ బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టాడు. 10 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.
సరైన లైన్ అండ్ లెంగ్త్‌ను సాధించగల విలియం ఓ'రూర్కే సామర్థ్యం.. భారత టాప్-ఆర్డర్ బ్యాటర్లకు సవాలుగా మారనుంది. భారత్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఓ'రూర్కే న్యూజిలాండ్ తరఫున ప్రభావం చూపే అవకాశం ఉంది.
3. విరాట్ కోహ్లీ
ఆదివారం దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీ తన మంచి ఫామ్‌ను కొనసాగించాలని చూస్తాడు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరపున రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల్లో 122 సగటుతో ఒక సెంచరీతో సహా 122 పరుగులు సాధించాడు. 36 ఏళ్ల అతను ప్రపంచంలోని అత్యుత్తమ దూకుడు బ్యాటర్లలో ఒకడు. ఒక్కసారి విరాట్ బ్యాట్ పరుగులు మొదలు పెడితే ఆపడం కష్టమే. దీనికి తోడు న్యూజిలాండ్‌పై కోహ్లీకి సూపర్ రికార్డు ఉంది. 31 మ్యాచ్‌ల్లో 58.75 సగటుతో ఆరు సెంచరీలతో సహా 1645 పరుగులు చేశాడు. కాబట్టి రాబోయే మ్యాచ్ లో కోహ్లీ పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.
4. రచిన్ రవీంద్ర
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం నుంచి బయటపడిన రచిన్ రవీంద్ర అద్భుతంగా తిరిగి వచ్చి సెంచరీ బాదాడు. 105 బంతుల్లో 112 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. పాకిస్థాన్‌తో జరిగిన వన్డే ట్రై-సిరీస్‌లో రవీంద్ర నుదిటిపై గాయం అయింది. ఆ తర్వాత అతను సిరీస్ నుండి, అలాగే పాకిస్థాన్‌తో జరిగిన న్యూజిలాండ్ తొలి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ కు దూరమయ్యాడు.
గాయం నుంచి కోలుకుని వచ్చిన మొదటి మ్యాచ్‌లో రచిన్ సెంచరీతో దుమ్మురేపాడు. ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడతాడు రచిన్ రవీంద్ర. స్పిన్, పేస్ బౌలింగ్ ను సమానంగా ఎదుర్కోగల 24 ఏళ్ల బ్యాటర్ భారత్ కు ముప్పు కలిగించే అవకాశముంది. కాబట్టి వీలైనంత తర్వరగా అతన్ని భారత బౌలర్లు పెవిలియన్ కు పంపాలి. లేకుంటే భారత్ గెలుపు అవకాశాలను దెబ్బతీయగలడు.
5. హర్షిత్ రాణా
బంగ్లాదేశ్‌తో భారత్ తొలి మ్యాచ్‌కు ముందు అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవన్‌కు ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. అయితే, బంగ్లాదేశ్-పాకిస్తాన్‌లతో జరిగిన భారత్ తొలి రెండు గ్రూప్ దశ మ్యాచ్‌లలో తన ప్రభావవంతమైన ప్రదర్శనతో రాణా విమర్శకుల నోళ్లు మూయించాడు. ప్రస్తుతం అతను 2 మ్యాచ్‌లలో 15.25 ఎకానమీ రేటుతో 4 వికెట్లు తీసి భారతదేశం తరపున రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. బంగ్లాదేశ్‌పై అతని అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 7.4 ఓవర్లలో 4.19 ఎకానమీ రేటుతో 3/31 వికెట్లు తీసుకున్నాడు.
6. కేన్ విలియమ్సన్
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో జరిగిన గత రెండు మ్యాచ్‌లలో కేన్ విలియమ్సన్ సింగిల్ డిజిట్ స్కోర్‌లకే అవుటయ్యాడు. వన్డే ట్రై-సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మంచి ప్రదర్శన ఇస్తాడని చాలా అంచనాలు ఉన్నాయి. అయితే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో విలియమ్సన్ జోరు కనిపించలేదు.
కానీ, అతని అపారమైన అనుభవం, ఒత్తిడిలో కూడా సూపర్ ఇన్నింగ్స్‌లను ఆడగల అతని సత్తాను తక్కువగా అంచనా వేయలేము. భారత్‌పై కేన్ విలియమ్సన్ మంచి రికార్డును కలిగి ఉన్నాడు, 29 మ్యాచ్‌ల్లో 44.11 సగటుతో 1147 పరుగులు సాధించాడు, అందులో సెంచరీ కూడా ఉంది.