
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ దశ మ్యాచ్ లు ముగిసిన ఈ ఐసీసీ టోర్నమెంట్ లో రికార్డుల మోత మోగిస్తున్నారు ప్లేయర్లు. మరీ ముఖ్యంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెంచరీల పండుగగా మారిపోయింది. పిచ్ లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో పరుగుల వరదపారిస్తూ సెంచరీ మోత మోగిస్తున్నారు.
ఐసీసీ ఛాంపియనన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఒక ఎడిషన్‌లో నమోదైన అత్యధిక సెంచరీలు ఇవే. గతంలో 2002, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్లలో 10 సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డులు బ్రేక్ అయ్యాయి.
సెంచరీల జాతరను మొదలుపెట్టిన న్యూజిలాండ్ ప్లేయర్లు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెంచరీల జాతరను తొలి మ్యాచ్ నుంచే న్యూజిలాండ్ ప్లేయర్లు మొదలుపెట్టారు. కీవీస్ ప్లేయర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ మొదటి మ్యాచ్ లోనే సెంచరీలతో అదరగొట్టారు. కరాచీలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఇద్దరూ సెంచరీలు సాధించి బ్లాక్ క్యాప్స్ జట్టుకు విజయాన్ని అందించారు.
ఇక రెండో మ్యాచ్ లో దుబాయ్‌లో భారత్-బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కూడా అదిరిపోయే సెంచరీలు నమోదయ్యాయి. మొదట బంగ్లాదేశ్ ప్లేయర్ తోహిద్ హృదయ్ అద్భుతమైన ఆటతో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత టార్గెట్ ను ఛేదించే క్రమంలో భారత జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ధనాధన్ ఇన్నింగ్స్ తో 101* పరుగులతో మరో సెంచరీ కొట్టాడు. దీంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్ లలోనే 4 సెంచరీలు నమోదయ్యాయి.
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ - ఆరు సెంచరీలతో అదరగొట్టాయి !
దక్షిణాఫ్రికాకు చెందిన ర్యాన్ రికెల్టన్ మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య రెండు సెంచరీలు వచ్చాయి. ఇంగ్లాండ్ జట్టు 352 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా విజయం వైపు నడిపించింది. జోష్ ఇంగ్లిస్ 120* పరుగులతో సెంచరీ సాధించగా, ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ 165 పరుగులతో సెంచరీ బాదాడు.
విరాట్ కోహ్లీ, జో రూట్, రచిన్ రవీంద్ర - అద్భుతమైన సెంచరీలు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పోరులో భారత స్టార్ విరాట్ కోహ్లీ దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 100* పరుగులు సాధించి భారత జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత మ్యాచ్ లో న్యూజిలాండ్ యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర బంగ్లాదేశ్‌పై 112 పరుగులతో సెంచరీ బాదాడు. ఆ తర్వాతి మ్యాచ్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఆఫ్ఘనిస్తాన్‌పై 120 పరుగులతో సెంచరీ సాధించాడు. ఆఫ్ఘానిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ కూడా సెంచరీతో అదరగొట్టాడు. అతని 177 పరుగుల ఇన్నింగ్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇన్నింగ్స్ గా రికార్డు సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో సెంచరీలు ఇవే:
1. విల్ యంగ్ (న్యూజిలాండ్) - కరాచీలో పాకిస్తాన్‌పై 113 బంతుల్లో 107 పరుగులు
2. టామ్ లాథమ్ (న్యూజిలాండ్) - కరాచీలో పాకిస్తాన్‌పై 104 బంతుల్లో 118* పరుగులు
3. తోహిద్ హృదయ్ (బంగ్లాదేశ్) - దుబాయ్‌లో భారత్‌పై 118 బంతుల్లో 100 పరుగులు
4. శుభ్‌మన్ గిల్ (భారత్) - దుబాయ్‌లో బంగ్లాదేశ్‌పై 129 బంతుల్లో 101* పరుగులు
5.ర్యాన్ రికెల్టన్ (దక్షిణాఫ్రికా) - కరాచీలో ఆఫ్ఘనిస్తాన్‌పై 106 బంతుల్లో 103 పరుగులు
6.బెన్ డకెట్ (ఇంగ్లాండ్) - లాహోర్‌లో ఆస్ట్రేలియాపై 143 బంతుల్లో 165 పరుగులు
7. జోష్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా) - లాహోర్‌లో ఇంగ్లాండ్‌పై 86 బంతుల్లో 120* పరుగులు
8. విరాట్ కోహ్లీ (భారత్) - దుబాయ్‌లో పాకిస్తాన్‌పై 111 బంతుల్లో 100* పరుగులు
9. రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) - రావల్పిండిలో బంగ్లాదేశ్‌పై 105 బంతుల్లో 112 పరుగులు
10. ఇబ్రహీం జాద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) - లాహోర్‌లో ఇంగ్లాండ్‌పై 146 బంతుల్లో 177 పరుగులు
11. జో రూట్ (ఇంగ్లాండ్) - లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 111 బంతుల్లో 120 పరుగులు