ఉప్పల్ స్టేడియంలో టీమిండియా రికార్డు ఎలా ఉంది... న్యూజిలాండ్‌తో తొలి వన్డేకి ముందు...

First Published Jan 18, 2023, 11:16 AM IST

హైదరాబాద్‌లో క్రికెట్ సందడి మొదలైపోయింది. కరోనా లాక్‌డౌన్ తర్వాత 2022 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌కి వేదిక నిచ్చిన భాగ్యనగరం, నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా వన్డే రికార్డు ఎలా ఉందంటే...
 

ఇప్పటిదాకా ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఆరు వన్డేలు ఆడింది. మొదటి మూడు వన్డేల్లో ఓడిన భారత జట్టు, ఆ తర్వాత మూడు వన్డేల్లో విజయాలు అందుకుంది. ఉప్పల్ స్టేడియంలో 2009లో జరిగిన వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 350 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్ టెండూల్కర్ 175 పరుగులు చేసి ఒంటరిపోరాటం చేయడంతో టీమిండియా 3 పరుగుల తేడాతో  పరాజయం పాలైంది...

2005లో సౌతాఫ్రికా, 2007, 2009 సంవత్సరాల్లో ఆస్ట్రేలియాలతో ఇక్కడ జరిగిన మ్యాచుల్లో ఓడిన టీమిండియా, 2011లో తొలి వన్డే విజయం అందుకుంది. ఇంగ్లాండ్‌పై 2011లో గెలిచిన భారత జట్టు, 2014లో శ్రీలంక, 2019లో ఆస్ట్రేలియాపై విజయాలు అందుకుంది...

న్యూజిలాండ్‌తో తొలిసారిగా ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగుతోంది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన గత ఆరు వన్డే సిరీస్‌లను సొంతం చేసుకుంది భారత జట్టు. దీంతో ఈసారి కూడా టీమిండియానే హాట్ ఫెవరెట్. ఇప్పటికే తొలి వన్డే మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.. 

ఉప్పల్ స్టేడియంలో యువరాజ్ సింగ్ 3 ఇన్నింగ్స్‌ల్లో 233 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా ఉండగా సచిన్ టెండూల్కర్ 220 పరుగులు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ 5 ఇన్నింగ్స్‌ల్లో 202 పరుగులు చేశాడు. ప్రస్తుత భారత జట్టులో విరాట్ కోహ్లీ ఇక్కడ మూడు మ్యాచులు ఆడి 134 పరుగులు చేశాడు..

rohit sharma

ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఇక్కడ భారీ స్కోరు చేస్తాడని అంచనా వేస్తున్నారు అభిమానులు. డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉన్నప్పుడే ఇదే హోమ్ గ్రౌండ్. కాబట్టి రోహిత్‌కి ఈ పిచ్‌పై పూర్తి అవగాహన ఉండి ఉండాలి...

ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పూర్తి కెపాసిటీ 55 వేల మంది. ఈ మ్యాచ్‌కి 45-50 వేల టికెట్లను విక్రయానికి పెట్టింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇవన్నీ గంటల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. దీంతో పూర్తిగా నిండిన స్టేడియంలో అరుపులు, కేకల మధ్య తొలి వన్డే జరగనుంది. 

click me!