ఇంత చేసినా, రవిచంద్రన్ అశ్విన్‌కి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదా... స్టార్ హోదాకి దూరంగా...

First Published Dec 25, 2022, 12:16 PM IST

రవిచంద్రన్ అశ్విన్, టెస్టుల్లో టీమిండియా ఆల్‌రౌండర్. 400లకు పైగా వికెట్లు, 3 వేలకు పైగా పరుగులు చేసిన అతి కొద్ది మంది ప్లేయర్లలో అశ్విన్ ఒకడు. అయితే ఇంత చేసినా అశ్విన్‌ స్టార్ స్టేటస్‌కి ఆమడ దూరంలో మిగిలిపోయాడు... టీమిండియాకి ఎన్నో విజయాలు అందిస్తున్నా అశ్విన్‌కి రావాల్సిన క్రేజ్ రావడం లేదు...

2020-21 ఆస్ట్రేలియా టూర్‌లో జరిగిన సిడ్నీ టెస్టులో టీమిండియా 272 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఓటమి నుంచి తప్పించుకోవాలంటే  మరో 134 పరుగులు చేయాలి. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్  - హనుమ విహారితో కలిసి వీరోచితంగా పోరాడాడు...

రవీంద్ర జడేజా చేతికి గాయం కావడంతో అశ్విన్‌కి ప్రమోషన్ దక్కింది. మరో వికెట్ పడితే బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడిన జడ్డూ, కట్టుతో డగౌట్‌లో కూర్చున్నాడు. అయితే హనుమ విహారి, అశ్విన్ కలిసి 46 ఓవర్ల పాటు పోరాడాడు. వికెట్ల పతనాన్ని అడ్డుగోడగా నిలిచి టీమిండియాకి చారిత్రక డ్రా అందించారు...

2022 ఇండియా- పాకిస్తాన్ మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఐదో బంతికి దినేశ్ కార్తీక్ స్టంపౌట్ అయ్యాడు. భారత జట్టు విజయానికి ఆఖరి బంతికి 2 పరుగులు రావాలి. ఈ సమయంలో క్రీజులోకి వచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...

నరాలు తెగే ఉత్కంఠ మధ్యలో వైడ్ బంతిని టచ్ చేయకుండా వదిలేశాడు. ఆ సమయంలో అశ్విన్ చూపించిన సమయస్ఫూర్తి... మరెవరికీ సాధ్యం కాదేమో. ఆఖరి బంతికి బౌండరీ బాది, టీమిండియాకి ఘన విజయాన్ని అందించాడు....

Ashwin

2022 డిసెంబర్ 25, 145 పరుగుల లక్ష్యఛేదనలో 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చాడు అశ్విన్. ఒక్క పరుగు వద్ద ఉన్నప్పుడు అశ్విన్ ఇచ్చిన క్యాచ్‌ని మోమినుల్ అందుకోలేకపోయాడు. ఆ క్యాచ్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుందని అతను ఊహించలేకపోయాడు...

ashwin

62 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, 5 వికెట్లు తీసి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ని కకావికలం చేసిన మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో 16 పరుగులు రాబట్టి... భారత జట్టుకి ఘన విజయం అందించాడు...

Ravichandran Ashwin

రవిచంద్రన్ అశ్విన్ ఏం చేయగలడో చెప్పడానికి ఈ మూడు సంఘటనలు పర్ఫెక్ట్ ఉదాహరణ. అయితే అశ్విన్‌కి దక్కాల్సినంత గౌరవం మాత్రం దక్కడం లేదన్నది నిజం. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్, రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత అశ్విన్, వైట్ బాల్ ఫార్మాట్‌కి దూరం కావాల్సి వచ్చింది. కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లు వరుసగా విఫలం అవుతున్నా మ్యాచులు మీద మ్యాచులు ఆడేస్తున్నారు. అయితే అశ్విన్ సరిగ్గా రెండు మ్యాచుల్లో రాణించకపోతే, తుది జట్టులో చోటు కోల్పోవాల్సి ఉంటుంది... 

రికార్డులు, గణాంకాల ప్రకారం చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే లెజెండరీ క్రికెటర్. అయితే భారత్‌లో అతనికి ఉన్న క్రేజ్ ప్రకారం చూసుకుంటే మాత్రం... ఓ సాధారణ ప్లేయర్! నిన్న మొన్న వచ్చిన కెఎల్ రాహుల్‌కి ఉన్న క్రేజ్‌లో సగం కూడా అశ్విన్‌కి దక్కలేదు.. 

click me!