
ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ మహిళల వన్డే చరిత్రలో కొత్త రికార్డులు నమోదుచేసింది. ఇరు జట్ల ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల సునామీ తెచ్చారు. మొత్తం 781 పరుగులు సాధించి వరల్డ్ రికార్డ్ నమోదుచేశారు. ఇంతకు ముందు 2017లో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో 678 పరుగులు నమోదు కాగా, ఆ రికార్డ్ ఈ సిరీస్‌లో బద్దలైంది.
సిరీస్ 1-1తో సమమైంది. డిసైడర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. ఓపెనర్ బెత్ మూనీ 75 బంతుల్లో 138 పరుగులతో సునామీ నాక్ ఆడారు. ఫోర్ల వర్షం కురిపిస్తూ భారత బౌలింగ్ ను దంచికొట్టారు. ఆమె తన ఇన్నింగ్స్‌లో 23 బౌండరీలు, ఒక సిక్స్ బాదారు. జార్జియా వాల్ 81 పరుగులు, పెర్రీ 68 పరుగులు చేశారు. ఆఖరులో ఆష్లే గార్డ్నర్ 39 పరుగులు జోడించడంతో ఆస్ట్రేలియా స్కోరు 47.5 ఓవర్లలో 412 పరుగులకి చేరింది. దీంతో మహిళా వన్డే చరిత్రలో అత్యధిక స్కోర్ రికార్డును సమం అయింది.
412 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో భారత్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టింది. ఇన్నింగ్స్ మరింత బలంగా మొదలెట్టింది. స్మృతి మంధాన దూకుడు మామూలుగా లేదు భయ్యా.. కొడితే ఫోర్ లేదా సిక్సు అనేలా ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టింది.
మంధనా కేవలం 50 బంతుల్లో సెంచరీ బాదింది. భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సాధించింది. అలాగే, మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. మంధాన 63 బంతుల్లో 125 పరుగులతో అద్భుతమైన ఆరంభాన్ని అందించింది. దీంతో భారత్ మ్యాచ్ ను ఈజీగానే గెలుచుకుంటుందని అనిపించింది. అయితే, మంధాన అవుట్ అయ్యాక భారత్ ఒత్తిడిలో జారుకుంది.
మంధాన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ 52 పరుగులు, దీప్తి శర్మ 72 పరుగులు చేసి భారత్ ను గెలుపు వైపు నడిపించారు. కానీ, మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో ఓటమిపాలైంది. అయితే ఆస్ట్రేలియా బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో భారత్ 47 ఓవర్లలో 369 పరుగులకే ఆలౌటైంది. భారత్ లక్ష్యాన్ని అందుకోకపోయినా, వన్డే చరిత్రలో టార్గెట్ ఛేజ్ చేస్తూ అత్యధిక 369 పరుగులు చేసిన జట్టుగా రికార్డులో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి.
• మహిళా వన్డేలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక 781 పరుగులు నమోదయ్యాయి.
• ఆస్ట్రేలియా 412 పరుగులతో వన్డే చరిత్రలో అత్యధిక స్కోర్ ను సమం చేసింది.
• భారత్ టార్గెట్ ఛేజ్ చేస్తూ 369 పరుగులు చేసి కొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించింది.
• మ్యాచ్‌లో మొత్తం 111 బౌండరీలు (99 ఫోర్లు, 12 సిక్స్‌లు) నమోదయ్యాయి.
• మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు కలిపి 1826 పరుగులు చేసి మరో ప్రపంచ రికార్డ్ సృష్టించాయి.
• మంధాన 50 బంతుల్లో సెంచరీ చేసి భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించింది.
• బెత్ మూనీ 57 బంతుల్లో సెంచరీ చేసి మహిళా వన్డే చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది.
భారత్-ఆస్ట్రేలియా సిరీస్ మొత్తం క్రికెట్ అభిమానులకు ఎన్నో అద్భుతమైన క్షణాలను అందించింది. ఒక్క మ్యాచ్‌లో 781 పరుగులు రావడం, ఒకే సిరీస్‌లో 1800 పైగా పరుగులు నమోదవడం, రెండు జట్ల ఆటగాళ్లు సెంచరీల మోత మోగించడం, సునామీ ఇన్నింగ్స్‌లు ఆడి కొత్త రికార్డులు సాధించడం.. ఇలా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటనలకు ఈ సిరీస్ వేదికైంది. క్రికెట్ చరిత్రలో మాస్టర్ క్లాస్ వన్డే సిరీస్ గా గుర్తింపు సాధించింది.