సౌతాఫ్రికా టూర్‌లో ఆ ఇద్దరికీ ప్లేస్ డౌటే... ఇషాంత్ శర్మతో పాటు అజింకా రహానేకి రెస్ట్ ఇచ్చే ...

First Published Dec 6, 2021, 3:06 PM IST

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో గెలిచిన భారత జట్టు, త్వరలో దక్షిణాఫ్రికా టూర్‌కి సిద్ధమవుతోంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కి త్వరలో జట్టును ఎంపిక చేయనుంది బీసీసీఐ...

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా సఫారీ టూర్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నారు...

అలాగే గాయం కారణంగా టెస్టు సిరీస్‌కి దూరమైన కెఎల్ రాహుల్‌, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలతో పాటు టెస్టు సిరీస్‌ నుంచి విశ్రాతి తీసుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయం...

అయితే దక్షిణాఫ్రికా టూర్‌కి ఎంపిక చేసే జట్టులో భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానేలకు స్థానం దక్కకపోవచ్చని టాక్ వినబడుతోంది...

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్ కూడా తీయలేకపోయిన ఇషాంత్ శర్మ, బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఇషాంత్ ఎడమచేతి చిటికిన వేలుకి తీవ్రగాయం కావడంతో అతనికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది టీమిండియా...

ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన ఇషాంత్ శర్మ, ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్‌కి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొన్నాడు...

ఇంగ్లాండ్ టూర్‌లో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి ఇషాంత్ శర్మ చేతికి గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకున్న ఇషాంత్, మరోసారి న్యూజిలాండ్‌తో సిరీస్‌లో గాయపడడంతో అతనికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు సమాచారం...

‘ఇషాంత్ శర్మకు గాయం కాకపోయి ఉంటే, అతనికి సౌతాఫ్రికా టూర్‌లో కచ్ఛితంగా ప్లేస్ ఉండేది. అయితే ఇప్పుడు అతనికి చోటు దక్కడం అనుమానంగా మారింది. తరుచూ గాయపడుతున్న ఇషాంత్‌ను పక్కనబెట్టాలని సెలక్టర్లు ఆలోచిస్తున్నారు...’ అంటూ తెలిపాడు ఓ బీసీసీఐ అధికారి...

మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తుండడం కూడా ఇషాంత్ శర్మకు చోటు దక్కకపోవడానికి కారణంగా మారింది. మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాలతో పాటు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్‌లకు సౌతాఫ్రికా టూర్‌లో అవకాశం దక్కవచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా...

అలాగే గాయం కారణంగా ముంబై టెస్టు ఆడలేకపోయిన టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానేకి కూడా సౌతాఫ్రికా టూర్‌లో చోటు దక్కుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది...

వరుసగా విఫలమవుతున్న రహానేని ఆ పదవి నుంచి తప్పించి, రోహిత్ శర్మను టెస్టు వైస్ కెప్టెన్‌గా ప్రకటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి...

అలాగే సౌతాఫ్రికా టూర్‌లో మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది భారత జట్టు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్‌గా కొనసాగడానికి ఇష్టపడతాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. 

click me!