
ICC Men's T20 World Cup 2026 : ఎట్టకేలకు టీమిండియా అనుకున్నది సాధించింది… స్వదేశంలో సొంత ప్రేక్షకుల ముందు సగర్వంగా టీ20 వరల్డ్ కప్ అందుకుంది. డిపెండింగ్ ఛాంపియన్ గా టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత జట్టు ఏ ఒక్కరో, ఇద్దరో ఆటగాళ్లపై ఆధారపడలేదు… టీం మొత్తం రాణించడంతోనే విజయం సాధ్యమయ్యింది. కాబట్టి జట్టులోని 11 ఆటగాళ్లు హీరోలే… నిజమైన టీమ్ స్పిరిట్‌కు ఈ వరల్డ్ కప్ విజయం నిలువుటద్దంగా నిలుస్తోంది.
దాదాపు నెలరోజుల పాటు జరిగిన ఈ ఐసిసి మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొన్నాయి. కానీ ఏ జట్టూ భారత్ తరహాలో రాణించలేకపోయింది. టీమిండియా మొత్తం మ్యాచ్ విన్నర్లతో నిండివుంది.. ఒకరి తర్వాత ఒకరు అద్భుతాలు చేశారు. క్షణాల్లో ఆట గమనాన్ని మార్చి సత్తా చాటారు.
టోర్నీకి ముందు ఆతిథ్య జట్టు భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా గెలుపు అంత సులువుగా రాలేదు. ఆరంభంలో కొన్ని తడబాట్లు, సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్నప్పుడు, అందరూ ఊహించిన ఆధిపత్యాన్ని భారత్ ప్రదర్శించింది. సూపర్-8, సెమీఫైనల్, ఫైనల్‌లో ప్రత్యర్థులను అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ తో చిత్తు చేసింది. గత 18 నెలలుగా పరిణతి చెందిన తమ బ్యాటింగ్ లైనప్ పవర్‌ను ప్రపంచానికి చూపించింది.
రెండు సంవత్సరాల్లోనే వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ ను భారత్ అందుకుంది. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. మరి ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా 11మంది హీరోల గురించి ఇక్కడు తెలుసుకుందాం.
ఏళ్ల తరబడి నిలకడలేమి, అంచనాలను అందుకోలేకపోవడంలో విఫలమయ్యాడు సంజు శాంసన్. కానీ అతడిపై అభిమానులకు నమ్మకం తగ్గలేదు… దాన్ని ఈ వరల్డ్ కప్ ద్వారా నిలబెట్టుకున్నాడు శాంసన్. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రదర్శనను సంజూ ఈ టోర్నీలో ఇచ్చాడు… ప్రత్యర్థులకు ఇచ్చిపడేశాడు.
వరల్డ్ కప్ 2026 కోసం ఎంపికైనా పేలవ ఫామ్ కారణంగా శాంసన్ కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఇలా గ్రూప్ స్టేజ్ లో అతడికి అవకాశం రాలేదు… అయితే సూపర్-8 లో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి తర్వాత సంజుకు అవకాశం వచ్చింది. స్టైలిష్ రైట్-హ్యాండర్ ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
తప్పకుండా గెలవాల్సిన మూడు కీలక మ్యాచ్‌లలో 97, 89, 89 పరుగులతో మూడు మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు శాంసన్. ముఖ్యంగా ఫైనల్‌లో అతడి ఆటతీరు అద్భుతం… ఇదే టీమిండియాకు అత్యధిక స్కోరు అందించి మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
టెక్నిక్‌పై తరచూ విమర్శలు ఎదుర్కొన్న శాంసన్, తన ఆటతో వాటన్నింటికీ గట్టి సమాధానం చెప్పాడు. వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లపై ఒత్తిడితో కూడిన నాకౌట్ గేమ్‌లలో అతని నిర్భయమైన స్ట్రోక్‌ప్లే కీలక విజయాలకు పునాది వేసింది.
టీ20 వరల్డ్ కప్ 2026 లో స్థిరమైన విషయం ఏదైనా ఉందంటే అది జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనే. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా పేరుగాంచిన బుమ్రా, వరుసగా మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేశాడు.
సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ అతడు మొదటి బంతికే వికెట్ తీశాడు. ఇది పరిస్థితులను అర్థం చేసుకోవడం, సరైన సమయంలో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో అతనికున్న అసాధారణ నైపుణ్యానికి నిదర్శనం.
న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్‌లో 15 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు బుమ్రా. ఇది టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అత్యుత్తమ గణాంకాలు. ప్రతి తరానికి ఓ అద్భుతమైన బౌలర్ వస్తుంటాడు… ఈ తరానికి బుమ్రా అలాంటివాడు. అతడిగురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
గత 18 నెలలుగా అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు… భారత జట్టులో అత్యంత విధ్వంసకర మ్యాచ్ విన్నర్లలో ఒకడిగా ఎదిగాడు. కానీ ఈ వరల్డ్ కప్ 2026 ఆరంభంలో అతనికి సవాళ్లు ఎదురయ్యాయి… అనారోగ్యం అతని రిథమ్, ఫిట్‌నెస్‌ను దెబ్బతీసింది. దీంతో చాలాకాలం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు.
ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఫామ్ కోల్పోయినప్పటికీ టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి సపోర్ట్ గా నిలిచింది. ఆ నిర్ణయం అద్భుతంగా ఫలించింది. ఫైనల్‌లో అత్యంత కీలక సమయంలో అభిషేక్ అదరగొట్టాడు. కీలకమైన హాఫ్ సెంచరీ సాధించి, పవర్‌ప్లేలో భారత్‌ను వికెట్ నష్టపోకుండా 92 పరుగులకు చేర్చాడు. దీంతో న్యూజిలాండ్ ఆశలపై దాదాపు నీళ్లు చల్లాడు.
ఓపెనర్ గా సంజు శాంసన్ అవకాశం ఇచ్చేందుకు ఇషాన్ కిషన్‌ను మూడో స్థానానికి మార్చారు. ఈ కొత్త పాత్రకు అతను సులభంగా అలవాటు పడ్డాడు. ఫైనల్‌లో ఈ లెఫ్ట్-హ్యాండర్ అత్యంత విధ్వంసకర ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు. కేవలం 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
అయితే ఈ టోర్నీలో అంతకుముందు అతని అత్యంత ముఖ్యమైన ఇన్నింగ్స్ వచ్చింది. కొలంబోలో పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కఠినమైన పిచ్‌పై 40 బంతుల్లో 77 పరుగులు బాదాడు.
సూపర్-8 లో జింబాబ్వేపై 24 బంతుల్లో 38 పరుగులు చేసి మిడిల్ ఆర్డర్‌లో తన విలువను నిరూపించుకున్నాడు. కొన్నాళ్ల క్రితం వరకు భారత జట్టు ప్రణాళికల్లో లేని కిషన్, ఇప్పుడు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీవ్రమైన ఒత్తిడితో టోర్నమెంట్‌లో అడుగుపెట్టాడు. 2024లో బార్బడోస్‌లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అతని ఫామ్ తగ్గింది. దీంతో వరల్డ్ కప్ 2026 లో అతని ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తాయి. అయితే స్వదేశంలో ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేసి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాడు.
వాంఖడేలో యూఎస్‌ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే, కఠినమైన పిచ్‌పై అద్భుతమైన 84 నాటౌట్‌తో సత్తా చాటాడు. సూపర్ 8 దశలో మరిన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేదని అభిమానులు భావించినప్పటికీ, టోర్నమెంట్ అంతటా అతని నాయకత్వం ప్రశాంతంగా, నిర్ణయాత్మకంగా ఉంది.
గత ఆరు నెలల్లో శివమ్ దూబే ఆటతీరులో వచ్చిన మార్పు అద్భుతం. ఒకప్పుడు స్పిన్ బౌలింగ్ లోనే సత్తా చాటుతాడనే పేరు ఉండేది.. కానీ ఇప్పుడు పేస్‌కు వ్యతిరేకంగా కూడా తన ఆటను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు దూబే.
ఈ టీ20 వరల్డ్ కప్ లో దూబే పరుగుల సునామీ టీమిండియా గెలుపులో నిర్ణయాత్మకంగా నిలిచింది. నెదర్లాండ్స్‌పై 66 పరుగులు, సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై కీలకమైన 43 పరుగులు, ఫైనల్‌లో కేవలం 8 బంతుల్లో 26 నాటౌట్.. ఇవన్నీ కీలక సమయాల్లో వచ్చాయి.ఈ మెరుపు ఇన్నింగ్స్‌లు తరచుగా భారత స్కోరును ప్రత్యర్థికి అందనంత దూరంలో నిలిపాయి.
వరల్డ్ కప్ 2026 కీలక సమయంలో తిలక్ వర్మ తన పాత్రను మార్చుకోవాల్సి వచ్చింది. టోర్నీకి ముందు గాయానికి గురయిన అతడు సర్జరీ చేయించుకున్నాడు… దీంతో లీగ్ దశలో మొదట ఇబ్బంది పడ్డాడు.. దీంతో అతడిని మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి మార్చారు.
కానీ బ్యాటింగ్ ఆర్డర్ మారాక తిలక్ అద్భుతంగా ఆడాడు… ఒక్కసారి రిథమ్ అందుకున్నాక మిడిల్ ఆర్డర్‌లో విలువైన అగ్రెసర్‌గా మారాడు. సూపర్ 8లో జింబాబ్వేపై 16 బంతుల్లో 44 పరుగులు చేయడం అతనికి కీలకమైన బ్రేక్‌త్రూ ఇచ్చింది. ఆ తర్వాత సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ పై కేవలం ఏడు బంతుల్లో 21 పరుగులు చేశాడు… దీంతో వాంఖడేలో భారీ స్కోరు సాధ్యమయ్యింది.
ప్రపంచ క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్ మరొకరు లేరు… మరోసారి ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఆల్‌రౌండర్ గా నిరూపించుకున్నాడు. కెప్టెన్ అతనిపై పూర్తి నమ్మకంతో ఇన్నింగ్స్‌లోని ప్రతి దశలోనూ బౌలింగ్ ఇచ్చాడు - పవర్‌ప్లే నుంచి డెత్ ఓవర్ల వరకు. దీన్ని అతడు నిలబెట్టుకున్నాడు.
బ్యాట్‌తో పాండ్యా టోర్నమెంట్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లో 27 పరుగులు చేసి భారత్ 250 పరుగుల మార్కును దాటడంలో సహాయపడ్డాడు. అతని ఆల్‌రౌండ్ ప్రదర్శన భారత విజయ ప్రస్థానంలో కీలకపాత్ర పోషించింది.
టీమిండియా వైస్-కెప్టెన్ అక్షర్ పటేల్ అహ్మదాబాద్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. భారత్ ఓడిపోయిన దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ కూడా అందులో ఉంది. అయితే వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం తిరిగి జట్టులోకి వచ్చి బలంగా పునరాగమనం చేశాడు.
సెమీఫైనల్‌లో అక్షర్ రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టి ఆటను మలుపు తిప్పాడు. ఫైనల్ మ్యాచులో పవర్‌ప్లేలోనే ప్రమాదకరమైన ఫిన్ అలెన్‌ను ఔట్ చేసి న్యూజిలాండ్‌ను వెంటనే ఒత్తిడిలోకి నెట్టాడు.
గత ఏడాదిన్నరగా వరుణ్ చక్రవర్తి భారత జట్టుకు ఒక మిస్టరీ ఆయుధంగా ఉన్నాడు.సూపర్ 8 దశ, నాకౌట్ మ్యాచ్‌లలో అతను కొంత రిథమ్ కోల్పోయినప్పటికీ, అతని మునుపటి ప్రదర్శనలు భారత ప్రస్థానంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.
టోర్నమెంట్ చివరి దశలో పరుగులు ఇచ్చినప్పటికీ, టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకం ఉంచింది. ఫైనల్‌లో అతను విధ్వంసకర బ్యాటర్ టిమ్ సీఫెర్ట్‌ను ఔట్ చేయగలిగాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లను మలుపు తిప్పగల సామర్థ్యం వరుణ్ కు ఉందని జట్టు ఇప్పటికీ నమ్ముతోంది.
బుమ్రా, అర్ష దీప్ సింగ్… ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లోని అత్యంత శక్తివంతమైన పేస్ జోడీలలో ఒకటి. తన సీనియర్ భాగస్వామిలాగే అర్షదీప్‌ను కూడా ఇన్నింగ్స్‌లోని అన్ని దశలలో బౌలింగ్ చేశాడు.. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లు. అతని క్రమశిక్షణ, కచ్చితత్వం, ఒత్తిడిలో రాణించే సామర్థ్యం.. ప్రత్యర్థి ఊపందుకుంటున్నప్పుడల్లా భారత్ నియంత్రణను కొనసాగించేలా చేశాయి.
భారత్ మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్ కేవలం స్టార్ ప్రదర్శనలు లేదా వ్యక్తిగత ప్రతిభ వల్ల రాలేదు. ఇది జట్టులోని ప్రతి ఆటగాడు అందించిన విజయం. కొన్నిసార్లు గట్టిగా, కొన్నిసార్లు నిశ్శబ్దంగా, కానీ ఎల్లప్పుడూ అవసరమైనప్పుడు తమ పాత్ర పోషించారు.
శాంసన్ పునరాగమనం నుంచి బుమ్రా అలుపెరగని ప్రతిభ వరకు, ఈ ప్రయాణం ఒత్తిడిలో రాణించే మ్యాచ్-విన్నర్లతో నిండిన జట్టును ప్రదర్శించింది. వారంతా కలిసి,భారత క్రికెట్‌లో మరో చరిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించారు.