డబ్బులివ్వమంటే చంపుతామని బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీమిండియా పేసర్ భార్య

First Published Feb 4, 2023, 2:47 PM IST

Deepak Chahar: భారత జట్టు  పేసర్, గతేడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన దీపక్ చహర్  భార్యకు  బెదిరింపు కాల్స్  రావడం సంచలనం కలిగించింది.  తమ వద్ద తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు గాను సదరు నిందితులు..
 

టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చహర్ భార్య జయా భరద్వాజ్ ను చంపేస్తామని  బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలను  తిరిగి ఇవ్వమన్నందుకు గాను  నిందితులు ఆమెను చంపేస్తామని  బెదిరించారు.  దీంతో చహర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకెళ్తే... రిఖ్ స్పోర్ట్స్ యజమాని అయిన  ధ్రువ్ పరేక్,  అతడి తండ్రి  కమలేష్ పరేక్  లు  జయా భరద్వాజ్ దగ్గర  రూ. 10 లక్షలు  అప్పుగా తీసుకున్నారు.  వ్యాపార విస్తృతిలో భాగంగా ఈ ఇద్దరూ  జయ దగ్గర  అప్పు తీసుకున్నారు.  గతేడాది అక్టోబర్  7న   ఆన్లైన్ వేదికగా జయ.. ధ్రువ్, కమలేష్ లకు   డబ్బులు పంపించారు.  

అయితే  వ్యాపారం  గురించి వదిలేసిన తండ్రీ కొడుకులు ఆ డబ్బును దుర్వినియోగం చేసుకున్నారని తెలిసుకున్న జయా..   తాను ఇచ్చిన డబ్బులను తిరిగివ్వాలని వారిని అడిగింది. అయితే తండ్రీకొడుకులు మాత్రం డబ్బులు తిరిగిచ్చేది లేదని జయాతో దుర్భాషలాడటమే గాక  చంపేస్తామని బెదిరించారు.  

ఈ విషయాన్ని జయా.. తన భర్తతో పాటు  మామకు  కూడా  చెప్పింది. విషయం తెలుసుకున్న చహర్ తండ్రి   ఆగ్రాలోని హరి  పర్వత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై  విచారణ చేపట్టారు. 
 

ఇదిలాఉండగా నిందితులలో ఒకరికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తో సంబంధాలున్నట్టు  సమాచారం.    గతంలో  హెచ్‌సీఏలో  అధికారిగా పనిచేసినట్టు పోలీసులు గుర్తించారని తెలుస్తున్నది.   మరి ఈ  మోసంలో  ధ్రువ్, కమలేష్ లే ఉన్నారా మరెవరైనా భాగమయ్యారా..? అన్న విషయాలపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. 
 

గతడాది  ఐపీఎల్  కు ముందు గాయపడ్డ చహర్.. మొత్తం సీజన్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.  ఆ తర్వాత అతడు  జూన్ 2న  పెళ్లి చేసుకున్నాడు. వెన్నునొప్పి గాయంతో బాధపడ్డ చహర్.. ఆగస్టులో తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ  స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ లో మళ్లీ గాయపడి  జట్టుకు దూరమయ్యాడు. 
 

click me!