
లీడ్స్ లోని హెడ్డింగ్‌లీ మైదానంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసినప్పటికీ విజయం దక్కలేదు. ఇంగ్లాండ్ బలంగా ఆడినంతగా, భారత జట్టు ప్రదర్శన కూడా ఉంది. కానీ కొన్ని విషయాల్లో విఫలమవడంతో ఓటమి పాలైంది.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీకి ఇది తొలి మ్యాచ్ అయినప్పటికీ అద్భుతమైన ప్రదర్శన చేసింది. గెలుపు అవకాశాలను చూపిస్తూ ముందుకు సాగింది. కానీ, చిన్న చిన్న పొరపాట్లతో భారీ ముల్యం చెల్లించాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ముందున్నది ఫీల్డింగ్ లోపాలు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ వదిలిపెట్టిన క్యాచ్ లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. బెన్ డకెట్ తొలి ఇన్నింగ్స్‌లోను, రెండో ఇన్నింగ్స్‌లోను జైస్వాల్ క్యాచ్ లు మిస్ చేశాడు. దీంతో క్రీజులో ఎక్కువ సేపు ఉండి ఇంగ్లాండ్ కు సూపర్ నాక్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగుల వద్ద వదిలిన క్యాచ్ తర్వాత డకెట్ మరో 51 పరుగులు చేశాడు.
ఆరంభంలోనే బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌లను బుమ్రా, రిషబ్ పంత్ లు కూడా వదిలేసారు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు వదిలేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే సంఖ్యలో క్యాచ్‌లు మిస్ చేశారు.
భారత బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్‌లో 430-3 పరుగులతో బలమైన స్థితిలో ఉండి 471 వద్ద ఆలౌటైంది. చివరి 7 వికెట్లు కేవలం 41 పరుగులకే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
చివరి 6 వికెట్లు కేవలం 31 పరుగులకే పడిపోయాయి. రెండు ఇన్నింగ్స్‌లలో టెయిల్ ఎండ్ ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయారు. ఒత్తిడి తట్టుకోలేకపోయారు. జోష్ టంగ్ రెండుసార్లు ఈ భాగాన్ని కుప్పకూల్చి, ఇంగ్లాండ్‌ను గేమ్‌లోకి తీసుకురావడంలో కీలకంగా మారాడు.
భారత స్టార్ బౌలర్లు ఈ మ్యాచ్ చివరిరోజు తమ సామర్థ్యాన్ని చూపలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వంటివారు డకెట్-క్రాలీ భాగస్వామ్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. డకెట్ 149 పరుగులతో ఆడగా, క్రాలీ 65 పరుగులు చేశాడు. మైదానం మారుతున్న సమయంలో బంతికి స్పిన్, బౌన్స్ తగ్గిపోవడం కూడా బౌలర్లకు అనుకూలించలేదు.
తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు తీసుకుని పర్వాలేదనిపించినా అప్పటికే ఇంగ్లాండ్ బిగ్ స్కోర్ మార్కును దాటింది. మిగతా బౌలర్లు రాణించలేకపోయారు. రెండో ఇన్నింగ్స్ లలో అయితే, మొత్తంగా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.
371 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేయడం ఓ సవాల్ అయినా, భారత బౌలింగ్ యూనిట్ చివరి రోజు పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది. బ్యాటింగ్‌లో సెంచరీలు చేసిన జట్టుకు, విజయం వైపు దూకుడుగా వెళ్లే ఆత్మవిశ్వాసం కనిపించలేదు.
ఫీల్డింగ్‌లో జరిగిన చిన్నచిన్న తప్పిదాలు మ్యాచ్‌పై ప్రభావం చూపాయి. ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో భారత ప్లేయర్లలో ఒత్తిడి కనిపించింది. ముఖ్యంగా బౌలర్లు వికెట్లు పడకపోవడంతో ఇది స్పష్టంగా కనిపించింది. ఇది ఫీల్డింగ్ పై కూడా ప్రభావం చూపించింది.
ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్బుతమైన సెంచరీతో ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 149 పరుగులతో అద్భుత సెంచరీ కొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా ఆయన 62 పరుగులు చేశారు. అతను మ్యాచ్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడని చెప్పవచ్చు. జో రూట్ (నాటౌట్ 53), జేమీ స్మిత్ ల సహకారంతో ఇంగ్లాండ్ అసాధారణమైన ఛేజ్‌ను విజయవంతం చేసింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ, "మేము కొన్ని అవకాశాలను మిస్ చేసుకున్నాం. క్యాచ్‌లు వదిలాం, లోయర్ ఆర్డర్ నుంచి మద్దతు రాలేదు. అయినా, జట్టు పోరాటం పై గర్వంగా ఉంది. ఇది యువ జట్టు, ఇంకా నేర్చుకుంటోంది" అని అన్నారు.
కాగా, ఇది టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఫలితాల్లో ఒకటి.. ఎందుకంటే ఒకే మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసిన జట్టు ఓడిపోవడం తొలిసారి. అంతేగాక, అదే మ్యాచ్‌లో ఆరు డకౌట్లు నమోదు కావడం కూడా అరుదైన ఘట్టం. భారత్ ఇప్పుడు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. మిగతా టెస్ట్‌లలో గెలుపు సాధించాలంటే, ఫీల్డింగ్, మిడిల్-లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ మెరుగుపరచాల్సిందే.