టీమిండియాకు ఆ విషయంలో స్పష్టత ఉండాలి.. టీ20 ప్రపంచకప్ జట్టుపై వెటరన్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Sep 13, 2022, 2:00 PM IST

T20I World Cup squad: అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న పొట్టిప్రపంచకప్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టును సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 

టీ20 ప్రపంచకప్ ను తిరిగి భారత్ తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోయే మెగా టోర్నీలో పాల్గొనబోతున్న టీమిండియా.. ఈ మేరకు సోమవారం   జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యం  వహిస్తున్న ఈ జట్టుకు కెఎల్  రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 

అయితే ఈ జట్టుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ బలాబలాలపై విశ్లేషణలు కూడా  వస్తున్నాయి. తాజాగా జట్టుపై  టీమిండియా  సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తనదైన శైలిలో స్పందించాడు. 

ఊతప్ప మాట్లాడుతూ.. ‘యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్  చాలా తెలివిగల బౌలర్లు.  వాళ్లెప్పుడూ  వికెట్లు తీసే బౌలర్లే. పేసర్లుగా  భువనేశ్వర్, బుమ్రా లతో పాటు అర్ష్దీప్ కూడా ఉన్నాడు. 

డెత్ ఓవర్లలో అర్ష్దీప్ కీలక బౌలర్. గత కొన్ని మ్యాచ్ లలో డెత్ ఓవర్లలో అతడు చాలా సమర్థవంతంగా  బౌలింగ్ చేస్తున్నాడు.  ఇక భువీ  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఆస్ట్రేలియా లో కూడా  భువీ రాణిస్తాడు. బౌలింగ్ లో భారత్ కు బెంగలేదు. ఒకవేళ ఏదైనా జరిగితే  సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ కూడా ఉన్నాడు. 

ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. టాప్-4 బలీయంగా ఉంది.   రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లతో టాపార్డర్  బలంగా ఉంది. అయితే ఐదో స్థానంలో జట్టులో తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఈ విషయంలో టీమిండియాకు  స్పష్టత ఉండాలి. ఐదో స్థానంలో దీపక్ హుడా, రిషభ్ పంత్ ల మధ్య  పోటీ ఉంది. ఆ విషయంలో భారత్ కు స్పష్టత ఉండాలి. ఆ స్థానం చాలా కీలకం...’ అని చెప్పాడు. 

జట్టు కూర్పు లో  ఐదో స్థానం కీలకం. టాప్-4లో ఉన్న నలుగురు బ్యాటర్లు రైట్ హ్యాండ్ బ్యాటర్లే. ఐదో స్థానంలో రిషభ్ పంత్ బ్యాటింగ్  కు వస్తే.. దినేశ్ కార్తీక్  ను పక్కనబెట్టాల్సి వస్తుంది. కానీ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్  కాంబినేషన్  కుదరాలంటే రిషభ్ పంత్ ను తీసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు.  మరి టీమిండియా ఈ విషయంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. 

టీ20 ప్రపంచకప్ కు  భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్
స్టాండ్ బై  ప్లేయర్లు : మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ 
 

click me!