వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి తర్వాత సౌతాఫ్రికాతో గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా చేజార్చుకున్న టీమిండియా.. బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగబోయే కీలక పోరులో తలపడనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే భారత్.. ఈ మ్యాచ్ తప్పకుండా నెగ్గాలి.
ఈ నేపథ్యంలో ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా.. ఇక్కడికి ప్రపంచకప్ నెగ్గడానికి వచ్చిందని, తాము మాత్రం అందుకు రాకపోయినా రోహిత్ సేనకు షాకిస్తామని హెచ్చరికలు జారీ చేశాడు. తమను తక్కువగా అంచనా వేస్తే ఫలితాలు తారుమారు అవుతాయని చెప్పాడు.
షకిబ్ మాట్లాడుతూ.. ‘మాకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. ప్రతీ మ్యాచ్ లోనూ ఒకే అప్రోచ్ తో ఆడతాం. ప్రత్యర్థి ఎవరనేది మాకు అనవసరం. జట్టుగా వంద శాతం మంచి ప్రదర్శన చేయడమే మాకు ముఖ్యం. అన్ని విభాగాలు బాగా ఆడితే ఎంత పెద్ద ప్రత్యర్థి అయినా మేము పట్టించుకోం..
మిగిలిన రెండు మ్యాచ్ లు మాకు చాలా ముఖ్యం. ఇండియా, పాకిస్తాన్ మీద గెలిస్తే అది ఆ రెండు జట్లకు కోలుకోలేని షాక్ ఇచ్చినట్టే అవుతుంది. కానీ ఆ రెండు జట్లు మాకంటే చాలా బలంగా ఉన్న జట్లు. ఒకవేళ మేము భాగా ఆడి అదృష్టం కలిసివస్తే ఆ మ్యాచ్ లను గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. మేమెందుకు గెలవకూడదు..? అనేదానికి అర్థమే లేదు. ఐర్లాండ్ ఇంగ్లాండ్ ను ఓడించలేదా..? పాకిస్తాన్ కు జింబాబ్వే షాకివ్వలేదా..? అదే పద్ధతిలో మేం ఆడితే మేం చాలా హ్యాపీ..
ఇక ఇండియాతో రేపటి మ్యాచ్ విషయానికొస్తే.. అడిలైడ్ లో వారికి మంచి మద్దతు ఉంటుంది. ఇండియా మ్యాచ్ అంటే అభిమానులు భారీగా వస్తారు. ఈ మ్యాచ్ లో ఇండియానే ఫేవరేట్. వాళ్లు ఇక్కడికి వచ్చిందే ప్రపంచకప్ గెలవడానికి. కానీ మేం అందుకు రాలేదు. మేం ఫేవరేట్లం కూడా కాదు. మీకు పరిస్థితి అర్థమై ఉండొచ్చు.
కానీ రేపటి మ్యాచ్ లో మేం మ్యాచ్ గెలిస్తే అది టీమిండియాకు షాకిచ్చినట్టే కదా. అందుకు మేం శాయశక్తులా కృషి చేస్తాం..’ అని చెప్పాడు. ఇక భారత మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పై షకిబ్ ప్రశంసలు కురిపించాడు. గత ఏడాది కాలంగా అతడు అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని తెలిపాడు.