టీమ్‌లోకి రావాలంటే ఈ ఫామ్ సరిపోతుందా సార్... సౌతాఫ్రికా టూర్‌లో సత్తా చాటుతున్న హనుమ విహారి...

First Published Dec 4, 2021, 11:27 AM IST

కెఎల్ రాహుల్ కంటే మెరుగైన టెస్టు గణాంకాలు, మయాంక్ అగర్వాల్ కంటే మెరుగైన ఫస్ట్ క్లాస్ యావరేజ్, ఛతేశ్వర్ పూజారా కంటే నిలకడ, అజింకా రహానే కంటే మెరుగైన సగటు... ఇన్ని ఉన్నా సెలక్టర్ల దృష్టిలో ఆకర్షించలేకపోతున్నాడు తెలుగు కుర్రాడు హనుమ విహారి... 

సిడ్నీ టెస్టులో గాయంతో బాధపడుతూనే ఆ నొప్పిని పంటిబిగువున అట్టిపెట్టి, వికెట్లకు అడ్డుగోడలా నిలబడి, టెస్టు క్రికెట్ ఫ్యాన్స్‌ హృదయాలు గెలుచుకున్నాడు హనుమ విహారి...

161 బంతుల్లో 23 పరుగులు ఎదుర్కొని, రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి దాదాపు నాలుగు గంటల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడ్డాడు హనుమ విహారి...

ఆ టెస్టులో గాయపడి, బ్రిస్బేన్ టెస్టులో బరిలో దిగలేకపోయిన హనుమ విహారి... ఆ తర్వాత టీమిండియా తరుపున మరో మ్యాచ్ ఆడలేకపోయాడు...

స్వదేశంలో జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌లో హనుమ విహారికి చోటు దక్కలేదు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే టీమ్‌కి ఎంపికైన విహారి, ఆ మ్యాచ్‌ కోసం ప్రాక్టీస్‌గా రెండు నెలల ముందే కౌంటీ మ్యాచుల్లో పాల్గొన్నాడు...

అయితే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కానీ, ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో కానీ హనుమ విహారికి అవకాశం రాలేదు. కేవలం రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు విహారి...

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కి హనుమ విహారిని ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సెలక్టర్లు ఆలస్యంగా మేల్కొని సౌతాఫ్రికాలో పర్యటించే భారత్-A టీమ్‌లో విహారిని చేర్చారు...

సౌతాఫ్రికా -ఏ జట్టుతో జరిగిన తొలి అనధికారిక టెస్టులో 53 బంతుల్లో 6 ఫోర్లతో 25 పరుగులు చేసిన హనుమ విహారి, రెండో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు...

తొలి ఇన్నింగ్స్‌లో 164 బంతుల్లో 8 ఫోర్లతో 54 పరుగులు చేసిన హనుమ విహారి, రెండో ఇన్నింగ్స్‌లో 116 బంతుల్లో 12 ఫోర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత ఓపెనర్ పృథ్వీషా, తొలి మ్యాచ్‌లో 45 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేసి అవుట్ కాగా... రెండో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 54 బంతుల్లో 42 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 14 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

విదేశాల్లో మెరుగైన రికార్డు ఉన్న హనుమ విహారిని, సౌతాఫ్రికా టూర్‌కి ఎంపిక చేయాలని భావిస్తున్న సెలక్టర్లు, అతనికి తగినంత ప్రాక్టీస్ కావాలనే ఉద్దేశంతో సౌతాఫ్రికా-ఏ, భారత్- ఏ మ్యాచుల్లో పాల్గొంటున్నాడని సమాచారం...

హనుమ విహారితో పాటు పృథ్వీషా, నవ్‌దీప్ సైనీ, దేవ్‌దత్ పడిక్కల్, కృష్ణప్ప గౌతమ్, ఉమ్రాన్ మాలిక్, ఇషాన్ కిషన్ వంటి భారత క్రికెటర్లు ఈ పర్యటనలో భారత్- ఏ తరుపున ఆడుతుండగా ఆఖరి మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ బరిలో దిగుతున్నాడు...

click me!