IND vs WII: గువాహటిలో సిక్స్ ల సునామీ.. 3 సెంచరీలతో పరుగుల వరద పారించిన వెస్టిండీస్

Published : Sep 30, 2026, 06:20 PM IST

India vs West Indies: గువాహటిలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధ్వంసం సృష్టించింది. జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్, అమీర్ జంగూ సెంచరీలతో భారత్‌ ముందు 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ బ్యాటర్లు టీమిండియా బౌలర్లను ఉతికేశారు.

PREV
15
కరేబియన్ల విధ్వంసం.. భారత్ ముందు 406 పరుగుల భారీ టార్గెట్

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా గువాహటిలో బార్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. భారత టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, విండీస్ జట్టును కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు తీవ్రంగా విఫలమయ్యారు.

నిర్ణీత 50 ఓవర్లలో వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి ఏకంగా 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. కరేబియన్ బ్యాటర్లు పవర్‌ప్లే నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జాన్ క్యాంప్‌బెల్ ఇచ్చిన దూకుడుతో ఇన్నింగ్స్ ఊపందుకుంది. మైదానం చిన్నది కావడంతో పాటు బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్‌పై విండీస్ హిట్టర్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు.

25
ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురి సెంచరీలు.. రికార్డులు బద్దలు

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు సరికొత్త రికార్డు సాధించారు. ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం విశేషం. పవర్‌ప్లేలో జాన్ క్యాంప్‌బెల్ (65 బంతుల్లోనే సెంచరీ) మెరుపు సెంచరీతో పునాది వేయగా, కెప్టెన్ షాయ్ హోప్ 94 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఆ తర్వాత వచ్చిన అమీర్ జంగూ కూడా తగ్గేదేలే అంటూ 77 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేసి టీమిండియా బౌలర్లను ఆడుకున్నాడు. వీరి ధాటికి వెస్టిండీస్ జట్టు వన్డే క్రికెట్ చరిత్రలో తమ అత్యధిక స్కోరు అయిన 405/7ను నమోదు చేసింది. గతంలో ఇంగ్లాండ్‌పై చేసిన 389 పరుగుల రికార్డును విండీస్ ఇక్కడ బ్రేక్ చేసింది.

35
తొలి వన్డేలోనే ఆకిబ్ నబీ అన్‌వాంటెడ్ రికార్డు.. తేలిపోయిన పేసర్లు

భారత బౌలర్లలో డెబ్యూటెంట్ ఆకిబ్ నబీకి ఈ మ్యాచ్ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన తొలి వన్డేలోనే 8.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 84 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. భారత్ తరఫున డెబ్యూ వన్డేలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా 1975 నాటి కర్సన్ ఘావ్రీ (83 పరుగులు) రికార్డును నబీ అధిగమించాడు. అతడి ఎకానమీ 9.51గా నమోదు కావడం గమనార్హం. మరోవైపు గుర్నూర్ బ్రార్ 10 ఓవర్లలో 96 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. గుర్నూర్ బ్రార్ ఓవర్లలో షమర్ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ ఆఖరి ఓవర్లలో చెలరేగి వేగంగా పరుగులు రాబట్టారు.

45
200 వికెట్ల మైలురాయి దాటిన కుల్దీప్ యాదవ్

భారీగా పరుగులు సమర్పించుకుంటున్న వేళ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కీమో పాల్ వికెట్ తీయడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా (123 వన్డేల్లో) 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కుల్దీప్ రికార్డు సృష్టించాడు. మొదటి స్థానంలో మహమ్మద్ షమీ 104 మ్యాచ్‌లతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ 10 ఓవర్లలో 65 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా కూడా 10 ఓవర్లు వేసి 75 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. జడేజా, జంగూ వికెట్ తీసిన తర్వాత బాలీవుడ్ పాట స్టెప్పులు వేయడం అభిమానులను ఆకట్టుకుంది.

55
సేఫ్ జోన్‌లో భారత్ ఉన్నట్టేనా? ఛేజింగ్ సాధ్యమేనా?

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 405 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, టీమిండియా క్షేమంగానే ఉందనే ధీమా వ్యక్తమవుతోంది. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హెవీ రోలర్‌ను ఉపయోగించమని అంపైర్లను కోరాడు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు పడే అవకాశం ఎక్కువగా ఉండటంతో బౌలింగ్ చేయడం ప్రత్యర్థి జట్టుకు చాలా కష్టంగా మారనుంది.

బౌండరీలు చిన్నవిగా ఉండటం, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో వికెట్లు చేతిలో ఉంచుకుంటే ఈ లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కు అసాధ్యమేమీ కాదు. అయితే, టీమిండియా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ పాటు విరాట్ కోహ్లీలు శుభారంభం అందిస్తేనే ఈ రికార్డు టార్గెట్ ను అందుకోవడం సాధ్యమవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories