IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?

Published : Aug 20, 2026, 12:08 PM IST

IND vs SL:మానవ్ సుతార్ స్పిన్ మ్యాజిక్ తో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. గాలే టెస్టులో మానవ్ సుతార్ 6 వికెట్లతో చెలరేగడంతో శ్రీలంకపై భారత్ 165 పరుగుల భారీ విజయం సాధించింది. సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

PREV
15
సెకండ్ టెస్టులోనే రికార్డు స్పెల్.. మానవ్ సుతార్ స్పిన్ దాటికి శ్రీలంక ఖేల్ ఖతం

గాలే క్రికెట్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం పడే సూచనలు స్పష్టంగా కనిపించాయి. దీంతో మ్యాచ్ డ్రాగానే ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, అప్పుడు శ్రీలంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు భారత యంగ్ ప్లేయర్. అద్భుతమైన బౌలంగ్ తో భారత యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ మ్యాచ్ ను ముగించాడు.

వర్షం పడటానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు, సుతార్ భారత్ టీమ్ కు అద్భుతమైన సెలబ్రేషన్స్ అందించాడు. విదేశీ గడ్డపై తనకు తొలి 6 వికెట్ల హాల్‌ అందించిన మ్యాచ్ విన్నింగ్ బంతిని తీసుకున్నాడు. కేషర నువాంతను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు 165 పరుగుల భారీ విజయాన్ని అందించాడు.

25
ఐదో రోజు లంక బ్యాటర్ల పోరాటం

టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు బ్యాటర్ల ముందు కొన్ని కఠినమైన ప్రశ్నలు ఉంటాయి. ఎంతసేపు క్రీజులో నిలబడగలరు? అవుట్‌సైడ్ ఎడ్జ్ కాకుండా బంతిని ఎలా మిస్ చేయాలి? డిఫెన్సివ్ మైండ్‌సెట్‌తో రోజంతా బ్యాటింగ్ చేయడం సాధ్యమేనా? ఇవన్నీ ఆలోచిస్తేనే ఏ బ్యాటర్‌కైనా ఒత్తిడి పెరుగుతుంది.

పాజిటివ్ నోట్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ధనంజయ డిసిల్వా, సోనాల్ దినూష మొదట్లో బాగానే నిలబడ్డారు. పిచ్‌పై స్పిన్‌కు పెద్దగా తిరుగుడు లేకపోవడంతో బ్యాటింగ్‌ చేయడం కాస్త ఈజీగానే అనిపించింది. రోజు ప్రారంభమయ్యే సమయానికి బంతి 34 ఓవర్ల పాతదిగా, కాస్త సాఫ్ట్‌గా మారింది. లంకకు ఇది కాస్త హోప్స్ ఇచ్చింది. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో పాత బంతితోనే కోలుకున్నారు. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తే భారత్‌ను ఇబ్బంది పెట్టవచ్చని అనుకున్నారు.

35
డిసిల్వాని దెబ్బతీసిన జడేజా

మొదటి గంటన్నర పాటు శ్రీలంక ప్లాన్ ప్రకారమే ముందుకు సాగింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ధనంజయ డిసిల్వా స్పిన్‌ను సరిగ్గా ఆడలేక రెండుసార్లు మాత్రమే పొరపాటు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తప్పు చేసినా అది నో బాల్ కావడంతో బతికిపోయాడు.

ఐదో రోజు ఉదయం తనకు లభించిన అవకాశాన్ని వాడుకోవాలని ధనంజయ చూశాడు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్ ఆడుతూ ఇండియన్ స్పిన్నర్లకు లెంత్ దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. స్వీప్ షాట్లు కూడా బాగానే ఆడాడు. కానీ జడేజా వేసిన ఒక బంతి అనుకున్నదానికంటే ఎక్కువ టర్న్ అయి అతని లైన్‌ను దెబ్బతీసింది. దాంతో ఒత్తిడికి గురైన ధనంజయ, జడేజా వేసిన ఒక క్వికర్ బంతిని స్వీప్ చేయబోయి షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న సుతార్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

45
ఐపీఎల్ ఆఫర్ ఇచ్చినా పడని డిక్వెల్లా

డిసిల్వా అవుటయ్యాక దినూషతో కలవడానికి నిరోషన్ డిక్వెల్లా క్రీజులోకి వచ్చాడు. లంకను రేస్‌లో నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ ఇండియన్ బౌలర్లు లంకకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. డిక్వెల్లాను టార్గెట్ చేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. అతనిపై బౌన్సర్ల వర్షం కురిపిస్తూ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ బౌన్సర్లు వేస్తుంటే, సర్కిల్ లోపల ఉన్న యశస్వి జైస్వాల్ డిక్వెల్లాతో స్లెడ్జింగ్ మొదలుపెట్టాడు.

ప్రతి బంతికి మధ్యలో డిక్వెల్లా దగ్గరకు వెళ్లిన జైస్వాల్, "స్క్వేర్ లెగ్ మీదుగా ఒక పెద్ద సిక్స్ కొట్టు, నీకు ఐపీఎల్ కాంట్రాక్ట్ ఇప్పిస్తాం" అని ఆటపట్టించాడు. డిక్వెల్లా నవ్వి ఊరుకున్నాడే కానీ ఆ ఎరలో పడలేదు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ తన లైన్ మార్చి వికెట్ తీశాడు. బాడీకి కాస్త దగ్గరగా షార్ట్ పిచ్ బంతి వేయడంతో, కవర్స్ వైపు కొట్టబోయిన డిక్వెల్లా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.

55
10 బంతుల్లో 4 వికెట్లు.. సుతార్ ఊచకోత

నాలుగు వికెట్లకు 84 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక, లంచ్ సమయానికి మరో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ తర్వాత దినూష, అరంగేట్రం ప్లేయర్ నువాంత కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే భారత స్పిన్నర్లు రౌండ్ ది వికెట్ వచ్చి బౌలింగ్ చేయడం మొదలుపెట్టారు. లెగ్ సైడ్ ఇద్దరు క్యాచ్ ఫీల్డర్లను ఉంచి స్వీప్ షాట్లను రిస్క్‌గా మార్చారు.

క్రమంగా ఒత్తిడి పెరగడంతో దినూష (84) సుతార్ బౌలింగ్‌లో ఫ్లైటెడ్ బంతిని ప్యాడ్‌కు తాకించి లెగ్ గుల్లీలో ఉన్న జురెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కేవలం 10 బంతుల వ్యవధిలోనే మానవ్ సుతార్ 4 వికెట్లు తీసి లంక ఇన్నింగ్స్‌ను కూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రభాత్ జయసూర్య, లాహిరు కుమారలను వరుస ఓవర్లలో అవుట్ చేసిన సుతార్, ఆ తర్వాత నువాంతను కూడా బౌల్డ్ చేసి తన రెండో టెస్టులోనే 6 వికెట్ల హాల్ సాధించాడు.

స్పిన్ వేరియేషన్స్, లైన్ అండ్ లెంగ్త్ కంట్రోల్‌తో మానవ్ సుతార్ చూపించిన ప్రతిభ టీమిండియా విజయంలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. లంకకు షాకిస్తూ భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Read more Photos on
click me!

Recommended Stories