అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు అవకాశం... దినేశ్ కార్తీక్ రీఎంట్రీ, తిలక్ వర్మకు నిరాశ...

First Published May 22, 2022, 5:45 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో కలిసి స్వదేశంలో ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడనుంది భారత జట్టు. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్, జూన్ 19న ముగియనుంది. తాజాగా ఈ సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టుకి కూడా జట్టును ప్రకటించింది బీసీసీఐ...

సౌతాఫ్రికా టూర్‌లో ఘోరంగా విఫలమైన కెఎల్ రాహుల్‌ని మరోసారి కెప్టెన్‌గా ఎంచుకున్న సెలక్టర్లు, రిషబ్ పంత్‌కి వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ఈ సిరీస్ ద్వారా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు...

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన దినేశ్ కార్తీక్, మూడేళ్ల తర్వాత తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతనితో పాటు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా వ్యవహరించబోతున్నారు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొట్టిన ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లకు అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, ముంబై ఇండియన్స్ తరుపున అదరగొట్టిన తిలక్ వర్మకు మాత్రం సౌతాఫ్రికా సిరీస్‌లో చోటు ఇవ్వలేదు... 

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అదరగొడుతున్న సీనియర్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠికి ఈ సిరీస్‌లో అవకాశం దక్కుతుందని వార్తలు ప్రచారం జరిగినా, త్రిపాఠికి మరోసారి మొండిచేయి చూపించారు సెలక్టర్లు... 
 

టీ20 సిరీస్‌కి జట్టు ఇదే: కెఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్...

అలాగే ఇంగ్లాండ్‌తో జరిగే రీషెడ్యూల్డ్ ఐదో టెస్టుకి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతుంటే, వైస్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన ఛతేశ్వర్ పూజారా, టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వగా కెఎస్ భరత్‌కి రెండో వికెట్ కీపర్‌గా అవకాశం దక్కింది...

టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్, కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

గత ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్ టూర్‌లో ఐదు టెస్టుల సిరీస్‌కి వెళ్లిన టీమిండియా, నాలుగు టెస్టులు ఆడి 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టుకి ముందు అప్పటి భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి సహా కోచింగ్ సిబ్బంది అంతా కరోనా బారిన పడడంతో ఈ మ్యాచ్ అర్ధాంతరంగా వాయిదా పడింది...

సిరీస్ ఫలితాన్ని నిర్ణయించేందుకు జూలై 1 నుంచి బర్మింగ్‌హమ్ వేదికగా ఇంగ్లాండ్, ఇండియా మధ్య ఐదో టెస్టు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి ఇరుజట్లు... 
 

గత నాలుగు టెస్టులకు భారత జట్టుకి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తే, హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నాడు. అలాగే ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా జో రూట్ ఉంటే, హెడ్ కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్ వ్యవహరించాడు...
 

Ben Stokes

అయితే ఐదో టెస్టుకి మాత్రం భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ, కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరించబోతుంటే... ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ వ్యవహరించబోతున్నారు..

click me!