ఇదేం పిచ్‌రా అయ్యా.. కోహ్లీ బౌలింగ్ వేసినా స్వింగ్ అయ్యేలా ఉంది.. అందుకే ఇలా తయారుచేశారా..?

First Published Sep 29, 2022, 10:47 AM IST

IND vs SA T20I:  ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య  తిరువనంతపురంలో ముగిసిన తొలి టీ20లో భారత్ ఈజీ విక్టరీ కొట్టింది.  బౌలర్లు పండుగ చేసుకున్న ఈ పిచ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వెళ్లువెత్తుతున్నాయి. 

Image credit: PTI

తిరువనంతపురంలో ఇండియా-సౌతాఫ్రికా మధ్య  బుధవారం రాత్రి ముగిసిన మొదటి టీ20 పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. అయితే టీ20 ఫార్మాట్  లో బ్యాటర్లకు అచ్చిరాని పిచ్ ఇది.  బౌలర్లు మాత్రం పండుగ చేసుకున్నారు. ముఖ్యంగా పేస్ బౌలర్లైతే  బ్యాటర్లను గజగజ వణికించారు.

Image credit: PTI

తొలుత భారత పేస్ ద్వయం  దీపక్ చాహర్,  అర్ష్‌దీప్ లు  సఫారీ బ్యాటర్లకు చుక్కలు చూపారు. 2.3 ఓవర్లలోనే  సఫారీలు 9 పరుగులు మాత్రమే చేసి ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయారు. ఔటైన వారిలో  బవుమా, డికాక్, మిల్లర్  లు క్లీన్ బౌల్డ్ కావడం గమనార్మం.  బంతిని  వదిలేస్తే వికెట్ల మీదకు రావడమే తరువాయి అన్నంతగా స్వింగ్ అయింది. 

Kagiso Rabada

సఫారీ బౌలర్లు కూడా తక్కువేమీ తినలేదు. ముఖ్యంగా పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై  ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ అయిన కగిసొ రబాడా రెచ్చిపోయాడు.  భారత ఇన్నింగ్స్ లో అతడు వేసిన తొలి ఓవర్ మెయిడిన్ కాగా తర్వాత ఓవర్లో  రోహిత్ ను ఔట్ చేశాడు. పార్నెల్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.

Arshdeep Singh and Deepak Chahar

అయితే మ్యాచ్ ముగిశాక ఈ పిచ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెళ్లువెత్తాయి. సాధారణంగా  విదేశాలలో.. అదీ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి చోట బంతులు లోపలికి  దూసుకొచ్చి వికెట్లను గిరాటేయడం చూస్తుంటాం. కానీ భారత్ లో ఇలాంటి పిచ్ లు ఉండటం చాలా అరుదు. దీంతో ఈ పిచ్ మీద జోకులు పేలుతున్నాయి.

జాతిరత్నాలు సినిమాలోని  ‘కేక్ పెట్టలే నువ్వు నాకు..’ అనే మీమ్   హల్చల్ చేస్తున్నది. ఈ పిచ్ తయారు చేశారేంట్రా అని బీసీసీఐ.. కేరళ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ను అడిగితే.. ‘నువ్వు మా సంజూ శాంసన్ ను ఎంపిక చేయలేదు..’ అని  చెప్పే మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ మీమ్ తెగ ట్రెండ్ అవుతున్నది.

కేరళకు చెందిన సంజూ శాంసన్ ను ప్రపంచకప్ కు ఎంపిక చేయలేదని ఆ రాష్ట్ర ఫ్యాన్స్ కొద్దిరోజులుగా బీసీసీఐపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే త్రివేండ్రం వచ్చిన భారత ఆటగాళ్ల బస్సు వ్దద కూడా  సంజూ ఫ్యాన్స్ హల్చల్ చేశారు. తాజాగా కేరళ క్రికెట్ అసోసియేషన్ కూడా  శాంసన్ ను ఆడించనందుకే ఇటువంటి పిచ్ తయారు చేసిందని  ట్రోల్స్ వస్తున్నాయి.

ఇంక మరికొందరైతే ‘ఇదేం పిచ్ రా  అయ్యా..  ఎప్పుడూ బౌలింగ్ చేయని విరాట్ కోహ్లీ  రెండు ఓవర్లు వేస్తే సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యేలా ఉంది..’ అని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఆసీస్ లో ఉండే బౌన్సీ పిచ్ లకు టీమిండియా అలవాటు పడటానికే బీసీసీఐ కేరళలో ఈ తరహా పిచ్ తయారుచేసిందనే వాదనలు కూడా  వస్తున్నాయి. మరి ఇది కేరళ వరకేనా..? గువహతి, ఇండోర్ (రెండు, మూడు టీ20లు) లో కూడా కొనసాగుతుందా..? అనేది త్వరలో తేలనుంది.
 

click me!