
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ 7 పరుగులు, విరాట్ కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత జట్టు ప్రారంభంలోనే ఒత్తిడిలో పడింది. రుతురాజ్ గైక్వాడ్ 18 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22 పరుగులతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే న్యూజిలాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో భారత బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
టాప్ ఆర్డర్ విఫలమైన సమయంలో అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ బాధ్యతాయుతంగా ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ ఇద్దరూ కీలక పరుగులు జోడించారు. అక్షర్ 55 బంతుల్లో 46 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 58 బంతుల్లో 46 పరుగులు సాధించాడు. వీరిద్దరూ అర్ధ సెంచరీకి చేరువలో వికెట్లు కోల్పోవడంతో భారత్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. నమన్ ధీర్ 22 పరుగులు చేశాడు. చివర్లో మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించారు. సిరాజ్ 20 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 14 పరుగులు చేయగా.. అర్ష్‌దీప్ కేవలం నాలుగు బంతుల్లోనే రెండు సిక్సర్లతో 14 పరుగులు సాధించాడు. వీరి పోరాటంతో భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్, జాకబ్ డఫీ మూడేసి వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ ఫిషర్ రెండు వికెట్లు తీశాడు.
210 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు ఆరంభం నుంచే గట్టి పోటీ ఇచ్చారు. మహ్మద్ సిరాజ్ తన బౌలింగ్‌తో టిమ్ సీఫర్ట్‌ను 14 పరుగుల వద్ద వెనక్కి పంపించాడు. ఆ తర్వాత ఫిన్ అలెన్‌ను ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేర్చి కివీస్‌పై ఒత్తిడి పెంచాడు. అర్ష్‌దీప్ సింగ్ విల్ యంగ్ (22) వికెట్ తీసుకున్నాడు. నిక్ కెల్లీ 24 పరుగులు చేయగా, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ 19 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే భారత బౌలర్లు కీలక భాగస్వామ్యాలు ఏర్పడకుండా అడ్డుకోవడంతో న్యూజిలాండ్ లక్ష్యానికి దూరమైంది.
మధ్య ఓవర్లలో మిచెల్ సాంట్నర్ 24 పరుగులు, క్రిస్టియన్ క్లార్క్ 16 పరుగులు చేసి పోరాడారు. అయినప్పటికీ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. నమన్ ధీర్ సాంట్నర్‌ను ఔట్ చేయడంతో న్యూజిలాండ్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ తన పదునైన బౌలింగ్‌తో క్లార్క్ వికెట్ పడగొట్టాడు. అక్షర్ పటేల్ కూడా కీలక సమయంలో జాకబ్ డఫీని పెవిలియన్‌కు పంపించాడు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు సాధించగా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు తీశారు. ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, నమన్ ధీర్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది.
ఐదు వన్డేల సిరీస్‌లో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రెండు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించి సిరీస్‌లో ముందంజ వేసింది. మూడో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. నాలుగో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి సిరీస్‌పై ఆశలు పెంచుకుంది. దీంతో చివరి వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా భారత బౌలర్లు అద్భుతంగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. 22 పరుగుల తేడాతో గెలిచి వన్డే సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకున్నారు. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కూడా గెలుచుకున్న భారత్.. న్యూజిలాండ్ పర్యటనను రెండు ఫార్మాట్లలో విజయాలతో ఘనంగా ముగించింది.