IND vs ENG: లార్డ్స్ లో రోహిత్ సెంచరీ కొట్టినా దక్కని విజయం.. భారత్ కొంపముంచిన ఆ 5 తప్పులు ఇవే

Published : Jul 20, 2026, 06:30 AM IST

India vs England: లార్డ్స్ వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ కోల్పోయింది. రోహిత్ శర్మ 138 రన్స్ చేసినా భారత్‌కు నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి గల 5 ముఖ్య కారణాలు ఇక్కడ చూద్దాం.

PREV
16
ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే

లార్డ్స్ లో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ చేతిలో 27 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-2తో ఇంగ్లాండ్‌కు చేజార్చుకుంది. లార్డ్స్ గ్రౌండ్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్ స్కోరు నమోదైన ఈ పోరులో, ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ (110 బంతుల్లో 138) అద్భుత సెంచరీతో, విరాట్ కోహ్లీ (74) అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయారు. టీమిండియా కొంపముంచిన ఆ ఐదు ప్రధాన కారణాలు గమనిస్తే..

26
పవర్ ప్లేలో బౌలర్ల దారుణ వైఫల్యం

టాస్ ఓడి మొదట బౌలింగ్‌కు దిగిన భారత జట్టుకు పవర్ ప్లేలోనే ఇంగ్లాండ్ ఓపెనర్లు గట్టి షాక్ ఇచ్చారు. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం, కేవలం ఐదుగురు ప్రధాన బౌలర్లతోనే బరిలోకి దిగడం జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది. పవర్ ప్లేలో భారత బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ లేకుండా విచ్చలవిడిగా బంతులు వేశారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్ (141), జాకబ్ బెథెల్ (91) ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే భారీగా పరుగులు పిండుకున్నారు. తొలి 20-30 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం భారత బౌలింగ్ వైఫల్యానికి నిదర్శనం.

36
డెత్ ఓవర్లలో చేతులెత్తేసిన బౌలింగ్

మ్యాచ్ 45 ఓవర్ల వరకు భారత జట్టు నియంత్రణలోనే ఉన్నట్లు కనిపించినా, చివరి ఓవర్లలో బౌలర్లు చేతులెత్తేశారు. చివరి 5 ఓవర్లలో ఇంగ్లాండ్ ఏకంగా 82 పరుగులు రాబట్టింది. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ వేసిన ఓవర్లలో జోస్ బట్లర్ (13 బంతుల్లో 41 నాటౌట్), జో రూట్ (48 బంతుల్లో 74 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. ప్రసిద్ధ్ వేసిన 49వ ఓవర్లో, గుర్నూర్ వేసిన 48వ ఓవర్లో తలో 23 పరుగులు సమర్పించుకున్నారు. ఈ డెత్ ఓవర్ల ఫ్లాప్ షో వల్లే ఇంగ్లాండ్ 387 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. గుర్నూర్ బ్రార్ లార్డ్స్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలింగ్ గణాంకాలను (0/97) నమోదు చేయడం గమనార్హం.

46
రోహిత్ అవుటయ్యాక పెరిగిన రన్ రేట్ ఒత్తిడి

భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (77) తొలి వికెట్‌కు 147 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ అవుటయ్యాక వచ్చిన కోహ్లీతో కలిసి రోహిత్ రన్ రేట్‌ను కంట్రోల్‌లో ఉంచాడు. అయితే, 39వ ఓవర్లో లార్డ్స్ ప్రేక్షకుల స్టాండింగ్ ఓవేషన్ మధ్య 138 పరుగులు చేసిన రోహిత్ శర్మను పార్ట్ టైమ్ స్పిన్నర్ జాకబ్ బెథెల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రోహిత్ అవుటైన తర్వాతే అసలు కథ మొదలైంది. రన్ రేట్ ఒక్కసారిగా 13కు పైగా పెరిగిపోవడంతో మిగతా బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడింది.

56
సామ్ కరన్ స్లో బాల్స్ మాయాజాలం

లక్ష్య ఛేదనలో టీమిండియాను కట్టడి చేయడంలో ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కరన్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పిచ్‌పై వేగాన్ని మారుస్తూ అతను వేసిన స్లో బంతులను భారత బ్యాటర్లు అంచనా వేయలేకపోయారు. ఇషాన్ కిషన్ (14) కరన్ వేసిన 87 కిలోమీటర్ల వేగపు స్లో బాల్‌కు అవుట్ కాగా, జట్టుకు చివరి ఆశగా నిలిచిన విరాట్ కోహ్లీ సైతం సామ్ కరన్ వేసిన స్లో షార్ట్ డెలివరీకే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కరన్ కేవలం 6 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా ఇంగ్లాండ్ వైపు తిప్పేశాడు.

66
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వరుస ఫ్లాప్స్

రోహిత్, కోహ్లీ నిర్మించిన బలమైన పునాదిని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఉపయోగించుకోలేకపోయారు. రన్ రేట్ ఒత్తిడిని తట్టుకోలేక శ్రేయస్ అయ్యర్ డకౌట్ కాగా, కేఎల్ రాహుల్ కేవలం 12 పరుగులకే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అక్షర్ పటేల్ కూడా 2 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. లోయర్ ఆర్డర్‌లో అర్ష్‌దీప్ సింగ్ కొన్ని బౌండరీలు బాదినా, అప్పటికే మ్యాచ్ భారత్ చేతుల్లోంచి జారిపోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. చివరి ఓవర్లలో 60కి పైగా పరుగులు ఇవ్వడమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories