ఇలా అయితే కష్టం బాస్.. ఇంగ్లాండ్ మ్యాచ్‌లో తేలిపోయిన ఇండియా బౌల‌ర్లు. ఎందుకీ పరిస్థితి.?

Published : Jul 19, 2026, 09:20 PM IST

IND vs ENG 3rd ODI: లార్డ్స్ లో జ‌రుగుతోన్న‌ నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 387 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

PREV
13
డకెట్–బెథెల్ శతక భాగస్వామ్యంతో భారీ పునాది

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెథెల్ భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు బలమైన పునాది వేశారు. బెథెల్ 93 బంతుల్లో 91 పరుగులు చేసి అవుటయ్యే వరకు ఇంగ్లాండ్ స్కోరును వేగంగా ముందుకు నడిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

23
డకెట్ సెంచరీ.. రూట్, బట్లర్ మెరుపులతో భారీ స్కోరు

బెథెల్ అవుటైన తర్వాత కూడా ఇంగ్లాండ్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. బెన్ డకెట్‌కు జో రూట్ చక్కటి సహకారం అందించాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు మరో 101 పరుగులు జోడించారు. డకెట్ 135 బంతుల్లో 141 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాటింగ్‌లో 18 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. చివర్లో జో రూట్ 74 పరుగులతో అజేయంగా నిలవగా, కెప్టెన్ జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వేగం జోడించాడు. దీంతో ఇంగ్లాండ్ 387 పరుగుల భారీ స్కోరు సాధించింది.

33
పూర్తిగా తేలిపోయిన భారత బౌలింగ్

భారత బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమే రెండు వికెట్లు తీసి కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. మరో వికెట్ ప్రిన్స్ యాదవ్ ఖాతాలో పడింది. అయితే మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అక్షర్ పటేల్ తన 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా పరుగులు ఇచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ కూడా ఖరీదైన స్పెల్ వేశాడు. యువ బౌలర్లు ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్‌పై ఇంగ్లాండ్ బ్యాటర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు.

అభిమానుల అసంతృప్తి

ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత బౌలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. రెండో వన్డేలో మోకాలికి గాయపడిన బుమ్రా మూడో మ్యాచ్‌కు దూరమవడంతో భారత బౌలింగ్ పదును కోల్పోయింది. ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం కూడా జట్టుకు ఇబ్బందిగా మారింది. ఈ ప్రదర్శన తర్వాత సామాజిక మాధ్యమాల్లో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టు ఎంపిక, బౌలింగ్ వ్యూహాలపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వచ్చే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించే అవకాశం

ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కు అంత సులభం కాదు. అయితే ఈ భారీ స్కోరును విజయవంతంగా అందుకుంటే లార్డ్స్ మైదానంలోనే అరుదైన రికార్డు నెలకొల్పడమే కాకుండా సిరీస్‌ను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారత బ్యాటర్లపై భారీ బాధ్యత పడగా, శుభ్‌మన్ గిల్ సేన ఈ సవాలును ఎలా ఎదుర్కొంటుందో ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories