భారత్-బంగ్లాదేశ్ మధ్య 3 మ్యాచ్ ల టీ20ల సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ హైదరాబాద్‌లో జరిగింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు భారత్ తరఫున ఓపెనింగ్ బ్యాటింగ్‌కు దిగారు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. 4 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ బ్యాటింగ్ విశ్వరూపం మొదలైంది.
రిషద్ ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాదిన సంజూ శాంసన్
బంగ్లాదేశ్ బౌలింగ్‌ను సంజూ శాంసన్ చీల్చిచెండాడాడు. గ్రౌండ్ కు అన్ని వైపులా భారీ షాట్లు కొట్టాడు. అతను ఏ బంగ్లా బౌలర్‌ను విడిచిపెట్టలేదు. అందరి బౌలింగ్ లో పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో సంచలనం సృష్టించాడు. రిషద్ హుస్సేన్ వేసిన ఓవర్లో శాంసన్ వరుసగా 5 సిక్సర్లు బాదాడు. తొలి బంతికి పరుగులు చేయలేకపోయాడు. కానీ, ఆ తర్వాత ఐదు బంతులను భారీ సిక్సర్లుగా మలిచాడు. శాంసన్ ఈ ఓవర్ లో మరోసారి తన బ్యాట్ పవర్ ను చూపించాడు.