ట్రిపుల్ సెంచరీకి చేరువగా రవీంద్ర జడేజా.. కాన్పూర్ టెస్టులో మ్యాజిక్ చేస్తాడా?

First Published | Sep 24, 2024, 7:19 PM IST

Ravindra Jadeja triple century: భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో అద్భుతమైన రికార్డును సాధించడానికి సిద్ధంగా వున్నాడు. చెన్నై టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ భారీ విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించిన జడేజా కాన్పూర్ టెస్టులో మరో ఘనత సాధించనున్నాడు. 
 

Ravindra Jadeja

Ravindra Jadeja triple century: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆడుతున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చారిత్రాత్మక ఘనత సాధించడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. చెన్నైలోని ఎం ఏ చిదంబరం స్టేడియం లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో జడేజా అద్భుత ప్రదర్శన చేసి 280 పరుగుల తేడాతో భారత జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఇప్పుడు కాన్పూర్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా అతని నుండి అదే ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్‌లో జడేజా 'ట్రిపుల్ సెంచరీ' పూర్తి చేయడానికి సిద్ధంగా వున్నాడు. ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల ప్రత్యేక క్లబ్‌లో చేరనున్నారు.

చెన్నై టెస్టులో జడేజా అద్భుత ప్రదర్శన

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జడేజా బ్యాట్‌తో పాటు బంతితోనూ అద్భుతాలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇన్నింగ్స్ లో స్టార్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు తడబడినప్పుడు.. అశ్విన్‌తో కలిసి జడేజా భారీ భాగస్వామ్యం నెలకొల్పి 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టును మంచి స్కోరు వద్దకు తీసుకెళ్లాడు. బౌలింగ్‌లో జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ 3 వికెట్లు తీశాడు.


కాన్పూర్‌లో 'ట్రిపుల్ సెంచరీ' పూర్తి చేస్తాడా?

కాన్పూర్ టెస్టు మ్యాచ్‌లో జడేజా టెస్టు క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని సాధించగలడు. తొలి టెస్టులో 5 వికెట్లు తీయడంతో ఈ ఫార్మాట్‌లో 299 వికెట్లు తీశాడు. 300 వికెట్ల భారీ ఘనత సాధించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. మరో ఒక్క వికెట్ తీసుకుంటే టెస్టుల్లో ఈ ఘనత సాధించిన ఏడో భారత ఆటగాడిగా జడేజా నిలుస్తాడు. 

టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ వంటి ఆరుగురు భారతీయులు జడేజా కంటే ముందు వున్నారు.

జహీర్ ఖాన్-కపిల్ దేవ్ లను దాటేస్తాడా ?

కాన్పూర్‌లో జడేజా 300 టెస్టు వికెట్లు పూర్తి చేసి కపిల్ దేవ్, జహీర్ ఖాన్‌లను అధిగమించనున్నాడు. జడేజా ఇప్పటి వరకు ఆడిన 73 టెస్టు మ్యాచ్‌ల్లో 299 వికెట్లు తీశాడు. అశ్విన్ తన 74వ మ్యాచ్‌లో 300వ వికెట్ తీయడం ద్వారా అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం కపిల్ దేవ్ నాలుగో స్థానంలో, జహీర్ ఖాన్ ఐదో స్థానంలో ఉన్నారు, వీరిని జడేజా దాటేస్తాడు.

టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన భారత ఆటగాళ్ళు 

రవిచంద్రన్ అశ్విన్ - 54 మ్యాచ్‌లు
అనిల్ కుంబ్లే - 66 మ్యాచ్‌లు
హర్భజన్ సింగ్ - 72 మ్యాచ్‌లు 
కపిల్ దేవ్ - 83 మ్యాచ్‌లు 
జహీర్ ఖాన్ - 89 మ్యాచ్‌లు

Ravindra Jadeja and Rohit Sharma

కాగా జడేజా ఒక టెస్టు మ్యాచ్ లో 100 పరుగులతో పాటు 5కు పైగా వికెట్లు తీసిన అద్భుతమైన రికార్డును కూడా సాధించాడు. అలాగే 1000కు పైగా పరుగులు, 100కు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల ప్రత్యేక జాబితా లో కూడా చోటు సంపాదించారు.

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఐదు వికెట్లకు పైగా తీసిన భారత ఆటగాడిగా జడేజా ఘనత సాధించాడు. జడేజా తన కెరీర్‌లో 12వ సారి ఈ ఫీట్ సాధించాడు. తన టెస్ట్ కెరీర్‌లో 11 సార్లు ఇదే ఫీట్ పూర్తి చేసిన అశ్విన్ కంటే ముందున్నాడు. అశ్విన్- జడేజా తమ కెరీర్‌లో 10 సార్లు కంటే ఎక్కువ సార్లు అద్భుతమైన ఈ ఆల్ రౌండ్ ఫీట్‌ను పూర్తి చేశారు. 

Latest Videos

click me!