బాబర్‌కు జ్వరం.. కెప్టెన్‌గా సర్ఫరాజ్.. అయినా పెత్తనమంతా అతడిదే..

First Published Dec 28, 2022, 5:42 PM IST

PAKvsNZ: పాకిస్తాన్  - న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  భాగంగా మూడో రోజు ఆ జట్టుకు సారథిగా  మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్  వ్యవహరించాడు.   
 

పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ తో ఆతిథ్య జట్టు  కరాచీ వేదికగా తొలి టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన  టెస్టు సిరీస్ ను  0-3తో కోల్పోయిన పాకిస్తాన్.. ఈ సిరీస్ లో తిరిగి పుంజుకుని  పరువు దక్కించుకోవాలని భావిస్తున్నది. తొలి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

మూడో రోజు ఆటకు ముందు  బాబర్ ఆజమ్  జ్వరం కారణంగా   గ్రౌండ్ లోకి రాలేదు. అతడి స్థానంలో  మాజీ సారథి, చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన   సర్ఫరాజ్ అహ్మద్  కెప్టెన్ గా వ్యవహరించాడు. 

అయితే సర్ఫరాజ్ సారథిగా ఉన్నా  పెత్తనం మాత్రం మహ్మద్ రిజ్వాన్ దే. వాస్తవానికి  ఈ టెస్టులో   రిజ్వాన్ బెంచ్ కే పరిమితమయ్యాడు.  టీ20లలో నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నా టెస్టులలో మాత్రం అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో రిజ్వాన్ ఫెయిల్ అయ్యాడనే అతడిని  న్యూజిలాండ్ తో తొలి టెస్టులో ఆడించలేదు. 
 

మూడో రోజు ఆటలో  బాబర్ స్థానంలో సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా వచ్చిన   రిజ్వాన్.. తానే సారథిగా ఫీలైపోయాడు. ఆట మధ్యలో ఫీల్డర్లను మార్చుతూ హంగామా చేశాడు.  స్టాండ్ ఇన్ సారథిగా ఉన్న సర్ఫరాజ్ మాత్రం  బిత్తరచూపులు చూస్తూ కనిపంచాడు.  2019 తర్వాత జట్టులోకి వచ్చిన  సర్ఫరాజ్ కు  రిజ్వాన్ వ్యవహారం కొత్తగా అనిపించింది. 

నిబంధనల ప్రకారం సబ్ స్టిట్యూట్ గా వచ్చిన ఫీల్డర్.. బౌలింగ్ గానీ  కెప్టెన్సీ గానీ చేయడానికి అనుమతి లేదు.   కానీ అంపైర్ అనుమతితో  సబ్ స్టిట్యూట్ ఫీల్డర్  వికెట్ కీపర్ గా మాత్రం ఉండొచ్చు. కానీ ఈ నిబంధనను   రిజ్వాన్ తో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గాలికొదిలేసినట్టుగా ఉందని  మ్యాచ్ ను చూసిన నెటిజన్లు వాపోతున్నారు. 

ఇక చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్.. ఈ మ్యాచ్ లో  153 బంతుల్లో 86 పరుగులు చేశాడు.  బాబర్ తో కలిసి   ఐదో వికెట్ కు 196 పరుగులు జోడించాడు.  ఈ క్రమంలో సర్ఫరాజ్.. అరుదైన ఘనత సాధించాడు.  ప్రస్తుతం అతడు  పాకిస్తాన్ తరఫున అత్యధిక పరుగులు (టెస్టులలో) చేసిన వికెట్ కీపర్ గా నిలిచాడు. 50 టెస్టులలో సర్ఫరాజ్.. 37.06 సగటుతో  2,743 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. 

click me!